షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌..!

By అంజి  Published on  9 Dec 2019 4:09 AM GMT
షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌..!

ముఖ్యాంశాలు

  • షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటు
  • రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలో బృందం
  • దిశ హత్య, ఎన్‌కౌంటర్‌ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్న సిట్‌
  • నేడు హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ

హైదరాబాద్‌: దిశ హత్య ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను శుక్రవారం వేకువజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయినా.. కొందరు మాత్రం అలా ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తప్పుగా భావించారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల బృందం ఇప్పటికే విచారణ చేపడుతోంది. షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని, దిశ హత్య ఘటన స్థలాన్ని మానవ హక్కుల బృందం పరిశీలించి కీలక ఆధారాలు సేకరించింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. రాచకొండ కమీషన్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేష్‌ భగవత్‌ నేతృత్వంతో కూడా ఏడుగురు సభ్యులు గల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై సిట్‌ బృందం విచారణ చేపట్టనుంది. నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వివరాలను సిట్‌ బృందం సేకరించనుంది. దిశ హత్య, ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. ఈ ఘటనపై త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సిట్‌ బృందంలో వనపర్తి ఏస్పీ అపూర్వరావు, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

తెలంగాణ హైకోర్టులో నేడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరగనుంది. కాగా దిశ నిందితుల మృతదేహాలు మహబూబ్‌నగర్‌లోనే ఉన్నాయి. ఇవాళ హైకోర్టు నిర్ణయం తర్వాత మృతదేహాలను నిందితుల కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పోలీసులను ఎన్‌కౌంటర్‌ ఘటనపై ప్రశ్నించనుంది. మరో రెండు రోజుల పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఇవాళ, రేపు అన్ని శాఖల నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం నివేదికలు తీసుకోనుంది. ఇప్పటికే రెవెన్యూ, ఫోరెన్సిక్‌, పోలీసుల నివేదికలను ఎన్‌హెచ్‌ఆర్సీ కోరింది.

Next Story