కళ ద్వారా సామాజిక మార్పును తీసుకువస్తోన్న కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తోన్న హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ తమ ఆర్ట్ ఫర్ హోప్ –సీజన్ 5 విజేతలను ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఎంట్రీల నుంచి 40 మంది ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ లక్ష రూపాయల గ్రాంట్‌తో పాటుగా 10 సంస్థాగత గ్రాంటీలను సైతం ఎంపిక చేసి ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున గ్రాంట్‌ను అందించారు. ఎంపికైన ఆర్టిస్ట్‌లలో ఇద్దరు తెలంగాణా వాసులు కాగా వారిలో ఒకరిది హైదరాబాద్, మరొకరు వరంగల్ నివాసి. ‘గార్డియన్స్ ఆఫ్ ద హైవేస్ : ఏ టెర్రకోట ఆర్చివ్’ అంటూ చిత్రాన్ని గీసిన బొల్లా మానస్‌తో పాటుగా ‘అండర్ ద సేమ్ సన్’ అంటూ రచించిన చిత్రానికి గానూ వరంగల్‌కు చెందిన మనోజ్‌కుమార్ పన్నాల కూడా అవార్డు అందుకున్నారు.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ కార్పోరేట్ ఎఫైర్స్ ఏవీపీ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఎంట్రీలను నిష్ణాతులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేసిందన్నారు. తమ కళ ద్వారా చర్చను లేవనెత్తడంతో పాటుగా సామాజిక అవగాహన సైతం కల్పించే రీతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను విజేతలుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా విభిన్న కళాంశాలలో కూడా నిపుణులను ఎంచుకున్నామంటూ సీజన్ 5 విజేతలకు మెంటార్‌షిప్ అవకాశాలను అందించడంతో పాటుగా అదనపు నైపుణ్యాలను అందించేందుకు వర్క్‌షాప్‌లను సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన కళాకారుల ఆర్ట్ రూపాలను ఢిల్లీలో నిర్వహించే ఓ ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.