విషాదం.. ఇంట్లో ఫ్రీజ్‌ పేలి ముగ్గురు మృతి

Three of family die as compressor of refrigerator explodes in tamilnadu. తమిళనాడులోని చెంగల్‌పేట జిల్లా గుడువాంచెరిలో విషాద ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  4 Nov 2022 6:46 AM GMT
విషాదం.. ఇంట్లో ఫ్రీజ్‌ పేలి ముగ్గురు మృతి

తమిళనాడులోని చెంగల్‌పేట జిల్లా గుడువాంచెరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఓ అపార్ట్‌మెంట్‌లో రిఫ్రిజిరేటర్‌లోని కంప్రెసర్‌ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న మరో ఇద్దరు కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. మృతులను వి గిరిజ (63), ఆమె సోదరి ఎస్ రాధ (55), వారి సోదరుడు ఎస్ రాజ్ కుమార్ (48)గా గుర్తించారు. రాజ్ కుమార్ భార్య భార్గవి (40), కుమార్తె ఆరాధన (7) చెంగల్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

గూడువంచెరి జయలక్ష్మి వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో ఉంటున్న గిరిజ భర్త వెంకటరమణ గతేడాది అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మరణానంతరం గిరిజ తన కొడుకుతో కలిసి దుబాయ్ వెళ్లింది. నవంబర్ 2న గిరిజ వారి ఇంటికి వచ్చింది. వెంకటరమణ మొదటి వర్ధంతి సందర్భంగా కర్మలు చేయడానికి ఆమె సోదరుడు అతని కుటుంబం, సోదరితో ఒక రోజు ముందు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దం వినిపించడంతో ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇంట్లో నుంచి పొగలు రావడం చూసి తలుపులు పగలగొట్టారు. గదిలో ముగ్గురు తోబుట్టువులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. భార్గవి, ఆరాధన పడకగదిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. గిరిజ, రాధ, రాజ్‌కుమార్‌ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుడువంచెరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it