12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి.. చేతులు, కాళ్లు కొరికి..

Stray dog brutally attacks 12-year-old boy in Kerala's Kozhikode. కొద్ది రోజులుగా ఎక్కడా చూసినా కుక్కల స్వైర విహారమే కనిపిస్తోంది. వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు

By అంజి  Published on  13 Sep 2022 6:01 AM GMT
12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి.. చేతులు, కాళ్లు కొరికి..

కొద్ది రోజులుగా ఎక్కడా చూసినా కుక్కల స్వైర విహారమే కనిపిస్తోంది. వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్తున్న వారిపై, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా కేరళలోని కోజికోడ్‌లో ఓ వీధి కుక్క హల్‌చల్‌ చేసింది. అరక్కినార్​లో సైకిల్‌పై​ వస్తున్న నూరాస్‌ అనే 7వ తరగతి చదువుతున్న బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. కాగా 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇటీవల వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కుక్కల దాడి ఘటనల్లో తాజాది.

అరక్కినార్ వద్ద గోవింద విలాసం పాఠశాల సమీపంలోని ఇరుకైన సందులో తన ఇంటి ముందర సైకిల్ తొక్కుతున్న బాలుడు నూరాస్‌పై వీధికుక్క దాడి చేసినట్లు సీసీటీవీ రికార్డ్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం బాలుడు తన స్నేహితులను పలకరించేందుకు ఇంటి దగ్గర ఆగి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడి నుంచో వచ్చిన కుక్క అతనిపై విరుచుకుపడి కాలు కొరికింది. ఆ తర్వాత కుక్క అతని చేతిని కొరికింది. నూరాస్ కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అది అతన్ని బలంగా వెనక్కి లాగింది.

బాలుడు తన స్నేహితుడి ఇంట్లోకి ప్రవేశించే వరకు దాడి కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఇది గమనించిన స్థానికులు బాలుడిని రక్షించేందుకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల తరువాత, మరొక కుక్క ఇంటి నుంచి వెళ్లడం కనిపించింది. నూరస్ బంధువుల ప్రకారం.. అతని కాలు, చేతిపై కుక్క కొరికిన గాయాలు ఉన్నాయి. అతని ముఖం, ఛాతీపై గాయాల గుర్తులు ఉన్నాయి. కోజికోడ్‌లో ఆదివారం అదే కుక్క నలుగురు వ్యక్తులపై దాడి చేసింది. పదే పదే వీధికుక్కల దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.


Next Story