దక్షిణాదిలో ‘జియో హాట్‌స్టార్’ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి..!
దక్షిణ భారత మీడియా, వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది జియో హాట్ స్టార్. దక్షిణాదిలో సృజనాత్మకతను కొత్త పుంతలు తోక్కించే దిశగా జియోహాట్‌స్టార్ తన మాతృ సంస్థ జియోస్టార్ రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
దక్షిణ భారత మీడియా, వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది జియో హాట్ స్టార్. దక్షిణాదిలో సృజనాత్మకతను కొత్త పుంతలు తోక్కించే దిశగా జియోహాట్‌స్టార్ తన మాతృ సంస్థ జియోస్టార్ రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైలో మంగళవారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, తమిళ భాషాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎంపి స్వామినాథన్, గౌరవనీయ పార్లమెంటు సభ్యులు పద్మభూషణ్ కమల్ హాసన్, ఇంకా దక్షిణాది సినీ, బుల్లితెర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించింది. జియోస్టార్‌లో SVOD హెడ్ & చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్, జియోస్టార్‌క్లస్టర్, ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి హాజరై.. భారతదేశ వినోద రంగంలో జియోహాట్‌స్టార్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు గురించి, భారతీయ కథా కథనాలను మరింత విస్త్రత స్థాయిలో దక్షణాది ప్రేక్షకులకి అందించడానికి చేస్తున్న కృషి గురించి వివరించారు.
ఆ దిశగా జియోహాట్‌స్టార్ తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేస్తున్నట్లు జియోహాట్‌స్టార్ ప్రకటించింది. రాష్ట్ర సృజనాత్మక, నిర్మాణ వ్యవస్థను వేగవంతం చేయడానికి ఉమ్మడి దృష్టిని ప్రతిబింబించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది. ఇందులో భాగంగా, జియోహాట్‌స్టార్ తమిళనాడు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాంతీయతకు పెద్ద పీట వేసి, కొత్త తరం కథలు, భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశ్యం. ఆ దిశగా జియోహాట్‌స్టార్ నవతరం చిత్రనిర్మాతలు, రచయితలు, ఎడిటర్‌లు మరియు డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్‌లు, దిశానిర్దేశ శిబిరాలు (మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్), నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు వంటి సృజనాత్మక కేంద్రీకృత పథకాలను అందుబాటులో తీసుకురానుంది.
ఈ సరికొత్త అధ్యాయానికి ప్రతీకగా, దక్షిణాది సంస్కృతీ, సాంప్రదాయాలను చాటే, ప్రాంతీయ వినోద భవిష్యత్తుకి బాటలు వేసే 25 కొత్త టైటిల్స్‌తో కూడిన జియోహాట్‌స్టార్ బ్లాక్‌బస్టర్ సౌత్ లైనప్‌ను గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు సృజనాత్మక భవిష్యత్తు, తదుపరి కార్యాచరణ రూపకల్పన, ఈ ఒప్పందం ఉద్దేశ్యాల గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇలా అన్నారు: “జియోహాట్‌స్టార్‌తో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది. తమిళనాడు అన్ని దక్షిణాది రాష్ట్రాలకి కేంద్రంగా ఉంది. తెలుగు, కన్నడ, మలయాళం సినిమా ఇక్కడే పుట్టాయి. దక్షిణాది రాష్ట్ర కళాకారులకు ఇది నిలయం కావడం గొప్ప విషయం. తమిళ చరిత్రలో కళలు, సాహిత్యం ప్రత్యేకమైనవి. కళ మార్పు తీసుకురాగలదు, సినిమా ప్రజలను ఎడ్యుకేట్ చేయగలదు. తమిళ రచయితలు కథలను సామాజిక మార్పుకి ఆయుధంగా మార్చారు. అన్నాదురై, కలైంజర్ కరుణానిధి సంభాషణలు ప్రేక్షకులని అలరించడమే కాదు, గొప్ప స్పూర్తిని ఇచ్చాయి. మార్పుకి శ్రీకారం చుట్టాయి. సామాజిక మార్పులకు కారణమయ్యే కథల చరిత్ర మనకు ఉంది. దక్షిణ భారతదేశ సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది. కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం. కంటెంట్ బాగుంటే చాలు, భాష, ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి. కథను ఎలా చెప్పాలి, ఎలా ప్రజలకి చేరువ చేయాలి అనేదానికి కమల్ సార్ గోప్ప స్ఫూర్తి, ఉదాహరణ. సినిమాలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. 2012 లోనే కమల్ సార్ డైరెక్ట్ ఇంటికి సినిమాని విడుదల చేశారు. ఆ దిశగా జియో హాట్ స్టార్ అమలుచేస్తున్న ఈ ప్రాజెక్టుని స్వాగతిస్తున్నాను. ఈ భాగస్వామ్య ఒప్పందంతో యువ కళాకారులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా శిక్షణ ఇవ్వడానికి దోహదపడుతుంది. అలాగే క్రియేటివ్ లాబ్ లు ఏర్పాటవుతాయి. చెన్నై గ్లోబల్ ఫిలిం సిటీగా రూపాంతరం చెందుతుంది. రాబోయే 5 ఏళ్ళలో జియో హాట్ స్టార్ దక్షిణాది వినోద రంగంలో రూ. 12 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 15000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ భాగస్వామ్యంతో సినిమా ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.”
జియోస్టార్ SVOD బిజినెస్ & చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ హెడ్ సుశాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ: “జియోహాట్‌స్టార్ ఒక కలగా ప్రారంభమైంది. రేపటి వినోద భవిష్యత్తును నిర్మించడానికి, మన దేశం యొక్క గొప్ప చరిత్రను, కథలను మరింత విస్తృతంగా అందించడానికి, అత్యాధునిక సాంకేతికత ఆధారితమైన మరియు ప్రతిచోటా భారతీయ వినోదానికి గమ్యస్థానంగా మారింది. క్రీడలు మరియు వినోద కార్యక్రమాల ప్రత్యక్ష్ ప్రసారాలతో ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే మేము సాధించిన పురోగతి పట్ల సంతోషిస్తున్నాము. జియోహాట్‌స్టార్‌ను యావత్ భారతదేశానికి స్పష్టమైన ఎంపికగా స్థాపించాము. దక్షిణ భారత అద్భుతమైన కథా వీక్షణ వారసత్వం, భారతదేశ కథా సంస్కృతికి అనుగుణంగా, ప్రతి వీక్షకుడి అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా వైవిధ్యం, ప్రాప్యత, వీక్షణ అనుభవాలను అందిస్తూ గొప్ప, ప్రామాణికమైన కథనాలను ప్రోత్సహించడానికి మేము కృషి చెస్తున్నాము.”
దక్షిణాది సృజనాత్మక ప్రణాళికల గురించి, జియోస్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి స్పందిస్తూ: “దక్షిణ భారతదేశం ఎల్లప్పుడూ సృజనాత్మక శక్తి కేంద్రంగా ఉంది. భారతీయ కథ చెప్పే తదుపరి యుగాన్ని నిర్వచించే దిశగా సేవలు అందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉద్భవించిన కథలు ధైర్యసాహసాలతో కూడి ఉంటాయి, సృష్టికర్తలు నిర్భీతితో కథా సృష్టి చేశారు. ఇక దక్షిణాది ప్రేక్షకులు దేశంలో ఎక్కడా లేని విధంగా వినోద రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా ప్రతిభ, మౌలిక సదుపాయాలు, కొత్త కథా ధోరణులను అర్థవంతమైన, దీర్ఘకాలిక పెట్టుబడులతో ఈ వ్యవస్థను ఉత్తేజపరచడం మా నిబద్ధత. గత పది నెలల్లో, 500 మందికి పైగా సృష్టికర్తలు, దర్శకులు, షోరన్నర్లు జియో హాట్ స్టార్ కుటుంబంలో భాగమయ్యారు. దక్షిణాదిలోని ప్రతి సృష్టికర్త పెద్ద కలలు కనాలని, వాటికి ఒక రూపం ఇవ్వాలని, ఆ కథలను గతంలో కంటే మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. సౌత్ అన్‌బౌండ్ దక్షినాది సృజనాత్మక శక్తిని పెంపొందించడం మరియు ఈ కథలను వీలైనంత ఎక్కువ మందికి అందించేలా చేయడంలో వాగ్దానం చేస్తున్నాము.”
ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయ పార్లమెంటు సభ్యుడు పద్మభూషణ్ కమల్ హాసన్ మాట్లాడుతూ, “ఉయిరే ఉరవే తమిళే వణక్కం! ఈరోజు ఇంత భారీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అతిథులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. మిత్రులు మోహన్ లాల్, నాగార్జున, విజయ సేతుపతి.. అందరికీ స్వాగతం పలుకుతున్నాను. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలు తెరకి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి., మన మూలాలతో కూడిన కథలని అందరికీ అందించేందుకు కృషి చేయాలి. మదురై అయినా, మలప్పురం అయినా, మచిలీపట్నం అయినా.. ఇకపై అక్కడి కథలు రీజినల్ సినిమా కాదు. అవన్నీ నేషనల్ ట్రెజర్. ఒక మారుమూల ప్రాంతం మూల కథతో వచ్చిన ‘కాంతారా’ దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. మలయాళంలో ‘దృశ్యం’ కథనాన్ని మర్చిపోగలమా? తెలుగులో ‘బాహుబలి’, ‘పుష్ప’ ప్రతి ఒక్కరినీ, విదేశీయులను కూడా ఎంతగానో అలరించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్.. కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. కథలు చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలని అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో హాట్ స్టార్ట్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం. ఇక తమిళనాడు సమాచార, సాంకేతికత విభాగంలో ఉదయనిధి స్టాలిన్ గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు. మీడియా స్టడీ ప్రోగ్రామ్స్, ఆనిమేషన్, విఎఫ్ఎక్స్ రంగంలో స్ట్రక్చర్ ట్రైనింగ్ అందించాలి. ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో తమిళ కళాకారులు సత్తా చాటాలని కోరుకుంటున్నాను.”
ఇక జియో హాట్ స్టార్ దక్షినాదిలోని అత్యంత వైవిధ్యమైన కంటెంట్ పోర్ట్‌ఫోలియోలలో ఒకదాన్ని ఒరిజినల్స్, ఫ్రాంచైజీలు, సినిమాలు మరియు స్క్రిప్ట్ చేయని ఫార్మాట్‌లలో ప్రదర్శిస్తుంది. ఈ లైనప్‌లో కేరళ క్రైమ్ ఫైల్స్ S3, సేవ్ ది టైగర్స్ S3, హార్ట్‌బీట్ S3 మరియు గుడ్ వైఫ్ S2 వంటి బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీలు తిరిగి రావడం, దీర్ఘకాలంగా కథ చెప్పే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తుంది. ఈ పాపులర్ సిరీస్ తో పాటు, జియోహాట్‌స్టార్ కొత్త ఒరిజినల్స్ ‘కజిన్స్ అండ్ కళ్యాణమ్స్’, ‘మూడు లాంతర్లు’, ‘LBW - లవ్ బియాండ్ వికెట్’, ’రిసార్ట్’, సీక్రెట్ స్టోరీస్ : ‘రోస్లిన్’, ‘లింగం’ మరియు ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వంటివి ఉన్నాయి.
జియోహాట్‌స్టార్ ప్రీమియం ఒరిజినల్ కేటలాగ్‌ను విస్తరించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు పొందిన హిందీ సిరీస్ ‘ఆర్య’ను ప్రాంతీయ భాషలోకి అనువదించి ‘విశాఖ’ పేరుతో పరిచయం చేస్తోంది. అలాగే విజయ్ సేతుపతి నటించిన ‘కాట్టాన్’, నివిన్ పౌలీ నటించిన ‘ఫార్మా’ వంటి బోల్డ్ న్యూ ప్రొడక్షన్స్ కూడా అందిస్తోంది. ‘లక్కీ ది సూపర్‌స్టార్’, ‘కెనత్త కానోమ్’ వంటి కొత్త తరహా సినిమాలను కూడా జియో హాట్ స్టార్ అందిస్తోంది.
తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడలలో బిగ్ బాస్ సాధించిన అసమాన ప్రేక్షకాదరణతో.. జియోహాట్‌స్టార్ మరిన్ని రియాల్టీ షోలను అందించబోతుంది. కామెడీ కుక్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, సెకండ్ లవ్ వంటి సాంస్కృతిక, ఆధునిక ధోరణులతో వినూత్నమైన ఫార్మాట్‌లతో రియాలిటీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా దక్షిణాది ప్రేక్షకులతో మరింత భిన్నమైన అనుభూతిని అందిస్తోంది. ఇక ల్యాండ్ మార్క్ ప్రసారంగా, తెలుగులో ‘రోడీస్’ షోను పరిచయం చేస్తున్నారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ అడ్వెంచర్ ఫార్మాట్‌లలో ఒకటైన ఈ షో నాన్-ఫిక్షన్ విభాగంలో దక్షిణాది ప్రేక్షకులని విశేషంగా అలరిస్తుందని జియోహాట్‌స్టార్ బలంగా విశ్వసిస్తోంది.
దక్షిణాది ప్రఖ్యాత సినీ తారలు రాకతో ఈ కార్యక్రమం మరింత శోభను సంతరించుకుంది. కమల్ హాసన్, మోహన్‌లాల్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, నివిన్ పౌలీ, ఐశ్వర్య రాజేష్, కాజల్ అగర్వాల్, మీనా, ప్రియమణి, కాజల్ అగర్వాల్, నయనతార, సమంత, నిత్యా మీనన్, అజు వర్గీస్, లాల్, నీనా గుప్తా, వర్ధమాన కళాకారులు దీపా బాలు, అనుమోల్, చారుకేష్, కవిన్, అర్జున్ రాధాకృష్ణన్, గురు లక్ష్మణ్, స్మేహ మణిమేగలై, దర్శకులు జీతు జోసెఫ్, అహమ్మద్ ఖబీర్ తదితరులతో పాటు బనిజయ్ గ్రూప్, వికటన్, DQ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, ఆర్కా మీడియా, నావీ ప్రొడక్షన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.