షాకింగ్‌: వాటర్ ట్యాంక్‌లో మానవ మలం.. కలుషిత నీరు తాగి చిన్నారులకు అస్వస్థత

Faeces found in Tamilnadu SC colony’s water tank, probe commenced. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సీ) కాలనీకి చెందిన ఓవర్‌హెడ్‌ వాటర్‌

By అంజి  Published on  27 Dec 2022 5:58 AM GMT
షాకింగ్‌: వాటర్ ట్యాంక్‌లో మానవ మలం.. కలుషిత నీరు తాగి చిన్నారులకు అస్వస్థత

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సీ) కాలనీకి చెందిన ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌లో మానవ మలమూత్రాల లభ్యం కావడంపై తమిళనాడు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది ఎవరో కావాలనే చేసినట్లుగా తెలుస్తోంది. దీని కారణంగా ఆ కలుషిత నీరు తాగి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అయితే వారికి చికిత్స అందిస్తున్న వైద్యుడు నీటి నాణ్యతను పరిశీలించాలని కాలనీ వాసులను కోరారు. పుదుక్కోట్టై జిల్లాలోని ముట్టుకాడు పంచాయతీలోని వెంగైవాసల్ కాలనీకి నీటి సరఫరా చేసే ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లోకి మానవ మలమూత్రాలను పడేసినట్లు గుర్తించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామస్థుడు ఆర్.కుమరన్‌ మాట్లాడుతూ.. '' కొన్ని రోజులుగా నీరు భిన్నంగా కంపు కొడుతోంది. నీటి ట్యాంక్‌లో పెద్ద మొత్తంలో మానవ మలవిసర్జనను పడవేశారు. సిమెంట్‌తో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంక్ మూతను ఇద్దరు వ్యక్తులు కలిసి లేపుతేనె లేస్తుంది. సోమవారం మలమూత్రాలు కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యాం'' అని చెప్పారు.

గంధర్వకోట్టై ఎమ్మెల్యే, ఎం. చిన్నదురై మాట్లాడుతూ.. ''పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, ఇది దుర్మార్గుల చర్యగా అనిపిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేశాం. ఈ అమానవీయ చర్య వెనుక ఉన్న వ్యక్తులను పోలీసులు కనిపెట్టి, వారిని దేశ చట్టం ముందు నిలబెట్టండి'' అని అన్నారు. తమిళనాడులోని అనేక గ్రామాలలో, కులం అనేది తగాదాలు, హత్యలకు దారితీసే ప్రధాన కారకంగా ఉంది. నీటి ట్యాంకుల్లో మానవ విసర్జనలు పడటం కూడా రాష్ట్రంలో మొదటిసారి కాదు.

పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. ''ఇది దుర్మార్గుల చర్య కాదు, బదులుగా దీని వెనుక ప్రణాళికాబద్ధమైన ఎత్తుగడ ఉంది. చాలా ఏళ్ల పోరాటం తర్వాత 2017లో మేం నీటి కనెక్షన్‌ను పొందాము. ఇప్పుడు మాకు సక్రమంగా నీటి సరఫరా జరగడం ఎవరికైనా ఇష్టం లేకపోవడం వల్ల ఇది జరిగింది. ఈ దారుణం కులంతో ముడిపడి ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

Next Story
Share it