కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో హిందూ దేవుడి విగ్రహాన్ని తాకిన దళిత బాలుడి కుటుంబానికి రూ.60,000 జరిమానా విధించిన కేసులో కర్ణాటక పోలీసులు 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఊరేగింపు సందర్భంగా బయటకు తీయాల్సిన దేవుడి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడు చేతన్‌ను నిందితులు కొట్టారు. అతను దేవుడికి విగ్రహానికి చెందిన ఓ వస్తువును కూడా తీయడానికి ప్రయత్నించాడని స్థానికులు అంటున్నారు. ఉల్లేరహళ్లి గ్రామంలో సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగింది.
ఈ సంఘటన తర్వాత గ్రామంలోని పెద్దలు బాలుడి తల్లికి ఫోన్ చేసి, మీ కొడుకు దేవత విగ్రహాన్ని తాకడంతో రూ. 60,000 జరిమానా విధించామని, ఊరేగింపును మళ్లీ నిర్వహించాలని చెప్పారు. జరిమానా కట్టకుంటే బహిష్కరిస్తామని కూడా బెదిరించారు. ఈ ఘటనను తొలుత అధికారులు లెక్కచేయకపోయినా, ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించారు. దేవాలయం తాళం పగులగొట్టి దళిత కుటుంబాలను దర్శనానికి అనుమతించారు. మాలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజే గౌడ్ దళిత బాలుడి కుటుంబాన్ని పరామర్శించి భద్రత కల్పించారు.
ఇటీవలే ఆలయ నిర్మాణ పనులు జరిగాయని, ఈ నేపథ్యంలో గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నట్లు స్థానికులు తెలిపారు. జరిమానా చెల్లించే వరకు గ్రామంలోకి రావద్దని గ్రామ నాయకులు దళిత బాలుడి కుటుంబంపై బెదిరింపులకు దిగారు. బాలుడి తల్లికి కూడా అగంతకులు బెదిరింపు కాల్స్ చేశారు. ఈ ఘటనపై పోలీసుల తదుపరి విచారణ కొనసాగుతోంది.