నేటి నుంచే 'భారత్‌ జోడో యాత్ర'.. తండ్రి స్మారకం వద్ద నివాళులర్పించిన రాహుల్

Congress' 'Bharat Jodo Yatra' will start from today. నేడు కాంగ్రెస్‌ పార్టీ 'భారత్‌ జోడో యాత్ర' లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ యాత్రను కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

By అంజి  Published on  7 Sept 2022 10:20 AM IST
నేటి నుంచే భారత్‌ జోడో యాత్ర.. తండ్రి స్మారకం వద్ద నివాళులర్పించిన రాహుల్

నేడు కాంగ్రెస్‌ పార్టీ 'భారత్‌ జోడో యాత్ర' లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ యాత్రను కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ, వారి ఇబ్బందులు తెలుసుకుని, దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశ్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ యాత్ర కోసం రాహుల్‌గాంధీ నిన్న రాత్రి చెన్నైకి వెళ్లారు. ఇవాళ ఉదయం శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని రాహుల్​ సందర్శించారు.

తన తండ్రి రాజీవ్​ గాంధీకి రాహుల్‌ ప్రత్యేక నివాళులర్పించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాహుల్‌ గాంధీ ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్‌టైమ్‌.అనంతరం అక్కడి నుంచి తిరువనంతపురం మీదుగా రాహుల్‌ కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాలు, మాజీ సీఎం కామరాజ్‌ స్మారకాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కి అందించి యాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. భారత్‌ జోడో యాత్రను బుధవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. రాహుల్‌ పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడులో రాహుల్‌ పాదయాత్ర నాలుగు రోజులు కొనసాగనుంది. ఆ తర్వాత యాత్ర కేరళలోకి ప్రవేశిస్తుంది. రాహుల్‌ పాదయాత్రకు నిత్యం 3 షిఫ్టుల్లో 2,500 మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు. పాదయాత్ర సాగే ప్రాంతాల్లో హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రోజుకు సగటున 25 కి.మీ.దూరం యాత్ర సాగనుంది. భారత్‌ జోడో యాత్ర 5 నెలల పాటు 3,570 కి.మీ. కొనసాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఈ యాత్ర వెళ్తుంది. ప్రతిరోజూ రెండు విడతల్లో... ఉదయం 7 గంటల నుంచి 10.30 గం.ల వరకు, మధ్యాహ్నం 3.30గం.ల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర ఉంటుంది. రోజుకు సగటున 25 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. యాత్రలో రాహుల్‌గాంధీ వెంట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్‌ నేతలు నడక సాగించనున్నారు.

Next Story