కర్ణాటకలో బీజేపీది ఒంటరి పోరే: అమిత్‌ షా

BJP to go solo in Karnataka Assembly polls.. Amit Shah. బెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో అధికార బీజేపీ ఒంటరిగానే

By అంజి  Published on  1 Jan 2023 11:00 AM IST
కర్ణాటకలో బీజేపీది ఒంటరి పోరే: అమిత్‌ షా

బెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో అధికార బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బూత్‌ అధ్యక్షుల సదస్సులో అమిత్‌షా ప్రసంగించారు. కాషాయ పార్టీని గెలిపించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ''ఇది ప్రత్యక్ష పోటీ. జేడీ(ఎస్), కాంగ్రెస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు. జేడీ(ఎస్)కు ఓటేస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌కు వేసినట్లేనని'' అని అమిత్‌ షా అన్నారు.

బెంగళూరులో బీజేపీ 21 సీట్లు గెలుచుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "పార్టీ కార్యకర్తలు అన్ని ఇతర పనులను వదిలిపెట్టి, బీజేపీ విజయం సాధించడంపై దృష్టి పెట్టాలి'' అని అమిత్‌ షా అన్నారు. బీజేపీ మెజారిటీ సాధిస్తుందని, దక్షిణాది రాష్ట్రంలో కులతత్వం, కుటుంబ రాజకీయాలను అంతం చేస్తుందని షా అన్నారు. బెంగుళూరు, కర్ణాటక ఓటర్లు దేశభక్తులకు మద్దతిస్తారా? లేక దేశంలోని తుక్డే-తుక్డే ముఠాలకు మద్దతిచ్చే పార్టీలతో వెళ్తారా? అనేది నిర్ణయించుకోవాలని ఆయన కోరారు.

''బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యం కాదు. దేశ భద్రత ముఖ్యం'' అని అమిత్‌ షా అన్నారు.

Next Story