'మహిళలంటే గౌరవమే లేదు'.. బీజేపీకి ప్రముఖ నటి రాజీనామా
Actress Gayathri Raghuram announced quit from BJP. ప్రముఖ తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 3 Jan 2023 10:29 AM GMTప్రముఖ తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో మహిళలకు సమాన హక్కులు, సరైన గౌరవం ఇవ్వనందుకు తమిళనాడు బీజేపీని వీడాలని బరువెక్కిన హృదయంతో నిర్ణయం తీసుకున్నానని గాయత్రి రఘురామ్ అన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమళై సారథ్యంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర విమర్శలు చేశారు.
తమిళనాడు బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గాయత్రి రఘురామ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ.. ''మహిళలకు సమాన హక్కులు, గౌరవం ఇవ్వనందుకు బరువెక్కిన హృదయంతో తమిళనాడు బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నాను. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై నాయకత్వంలో మహిళలకు భద్రత లేదు.'' అని పేర్కొన్నారు. తమిళనాడులో నిజమైన బీజేపీ వాలంటీర్లను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
''అన్నామలై నాయకత్వంలో ఇకపై కొనసాగలేను. ఆయన నాయకత్వంలో సామాజిక న్యాయం ఆశించలేం. మహిళలు సురక్షితంగా ఉండండి. మిమ్మల్ని రక్షించడానికి ఎవరినీ నమ్మవద్దు. ఎవరూ రారు. మీరు మీ కోసం రక్షించుకునే స్థితిలో ఉండంది. మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి. మీకు గౌరవం లేని చోట ఎప్పుడూ ఉండకండి.'' అంటూ గాయత్రి రఘురాఘ్ ట్వీట్ చేశారు.
తమిళనాడు బీజేపీలో కొన్ని రోజులుగా అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని గాయత్రీ రఘురామ్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు అన్నమళై. అయితే నిజాలు మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి తొలగించారని, బీజేపీ పరువు తీస్తున్నారంటే అంగీకరించలేనని గాయత్రి రఘురామ్ బదులిచ్చారు.