5 రూపాయల కుర్‌కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు.. దుకాణాల దగ్గర జనం క్యూ

500 Rupees notes found in 5 Rupees kurkare packet . కుర్‌ కురే, లేస్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లలకైతే ఎంత ఇష్టమో

By అంజి  Published on  17 Dec 2022 3:02 PM IST
5 రూపాయల కుర్‌కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు.. దుకాణాల దగ్గర జనం క్యూ

కుర్‌ కురే, లేస్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లలకైతే ఎంత ఇష్టమో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తాజాగా కుర్‌కురేకు సంబంధించిన ఆసక్తికర ఘటన కర్ణాటకలోని రాయిచూర్‌లో జరిగింది. రూ.5 విలువ చేసే కుర్‌కురే ప్యాకెట్‌లో రూ.500 నోటు దొరికింది. మొదట ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. ఆ తర్వాత కొంతమందికి కుర్‌కురే ప్యాకెట్లలో డబ్బులు రావడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో కుర్ కురే కొనేందుకు పిల్లలే కాదు తల్లిదండ్రులు సైతం షాపుల ముందు బారులు తీరారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో చుట్టు పక్కల గ్రామాల వారు కూడా కుర్‌కురే కొనేందుకు ఆసక్తి చూపించారు.

దెబ్బకు దుకాణాల్లో ఉన్న కుర్‌కురే నిల్వలన్నీ అమ్ముడుపోయాయి. లింగసగూరు తాలూకా హునూర్ గ్రామంలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. 5 రూపాయల కుర్కురే ప్యాకెట్లలో 500 రూపాయల అసలు నోట్లు కనిపించాయి. వివిధ కంపెనీల కుర్కురే ప్యాకెట్లలో 500 రూపాయల నోట్లు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఒకే ప్యాకెట్‌లో 5 నుంచి 6 నోట్లు దొరకడం గ్రామస్తులకు ఉత్సుకత కలిగించింది. దీంతో మూడు రోజుల్లో గ్రామంలోని కుర్కురే నిల్వ అయిపోయింది. మొత్తమ్మీద ఈ కుర్కురే ప్యాకెట్‌లలో డబ్బులు వస్తాయని వార్తలు వైరల్‌గా మారాయి.

అయితే కిరాణ షాపుల యజమానులు కుర్‌కురే రీస్టాక్ తెచ్చి అమ్మినప్పుడు ఏ ప్యాకెట్లలో కూడా నోట్లు కనిపించలేదు. ఈ నోట్లు అసలైనవా లేక నకిలీ నోట్లా అనేది ఇంకా తేలలేదు. ముద్గల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story