దేశంలో త్వరలో నాలుగు కరోనా వ్యాక్సిన్లు: కేంద్ర మంత్రి
By సుభాష్ Published on 25 May 2020 2:58 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారికి ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇతర మందులతోనే కంట్రోల్ చేస్తున్నారు వైద్యులు. అయితే దీనికి సంబంధించి దేశంలో త్వరలోనే నాలుగు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ దశకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా, 14 మందిపై ఈ వ్యాక్సిన్‌లతో ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతాయన్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా కేసులు, మరణాలు చాలా తక్కువేనని అన్నారు.
అసలు ఈ లాక్‌డౌన్‌ని కరోనా వ్యాక్సిన్ అని చెప్పుకోవచ్చని ఆయన అభివర్ణించారు. లాక్‌డౌన్ విధించక ముందు మనదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి మూడు, నాలుగు రోజులు పట్టేదని, కానీ ఈ ఆంక్షలు విధించాక అది దాదాపు పదమూడు రోజులకు పెరిగిందన్నారు. సరైన సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉందన్నారు. కరోనా విషయంలో ధనిక దేశాలు నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
కాగా, గడిచిన 24 గంటల్లో 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఒక్క రోజులోనే 6వేలకుపైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటి వరకూ 131868కు చేరింది. గత 24 గంటల్లో 147 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 3867కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 54440 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 73560 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 2608 కరోనా కేసులు నమోదు కావడం మరింత భయాందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే.. ప్రపంచ కరోనా కేసుల్లో భారత్ 11వ స్థానంలో ఉంది. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో దాదాపు ముగ్గురు కరోనాతో చనిపోతున్నారు.