భారత్‌లో తీవ్ర స్థాయిలో కరోనా.. ఒకేరోజు 6767 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 5:26 AM GMT
భారత్‌లో తీవ్ర స్థాయిలో కరోనా.. ఒకేరోజు 6767 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కరోనాను ఎంత కట్టడి చేసినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 6767 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా, ఒక్క రోజులోనే 6వేలకు పైగా కేసులు నమోదు కావడం వ‌రుస‌గా ఇది రెండ‌వ‌రోజు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటి వరకూ 131868కు చేరింది. గత 24 గంటల్లో 147 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 3867కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 54440 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 73560 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 2608 కరోనా కేసులు నమోదు కావడం మరింత భయాందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే.. ప్రపంచ కరోనా కేసుల్లో భారత్ 11వ స్థానంలో ఉంది. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో దాదాపు ముగ్గురు కరోనాతో చనిపోతున్నారు

లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. మొదట్లో భారత్‌లో కేసులు నెమ్మదిగా ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఉదంతం తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్ప‌టి నుండి భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమై ఎన్నో జాగ్రత్తలు చేపడుతున్నా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Next Story