ఓ విద్యార్థిని కోసం ఆ ఊరికి వైఫై ఏర్పాటు చేసిన 'సోనూసూద్'
By సుభాష్ Published on 24 Aug 2020 2:18 PM ISTప్రస్తుతం కరోనా కాలంలో ఇబ్బందుల్లో పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్. కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారిపై బాలీవుడ్ హీరో సోనూసూద్ అండగా నిలిచారు. ఇప్పుడు సోనూసూద్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందికి తనకు తోచిన విధంగా సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎంతో మంది ధనికులున్నా.. సోనూసూద్ లాంటి వ్యక్తి పేదలకు అండగా నిలుస్తూ వారి గుండెల్లో ఓ దేవుడిగా నిలుస్తున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో చిక్కుకున్నవారిని సొంత డబ్బులతో స్వదేశానికి రప్పించాడు. అప్పటి నుంచి సోనూసూద్ సాయం కోసం ప్రతి రోజు వేలాది మంది సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. తాజాగా ఓ గ్రామంలో ఇంటర్‌నెట్ సౌకర్యం లేదని లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంతో వారి బాధను సోనూసూద్ అర్థం చేసుకుని ఆ గ్రామానికి వైఫై సౌకర్యం కల్పించారు.
మహారాష్ట్రలోని సిందూ దుర్గ్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కోసం ఊరు మొత్తానికి వైఫై సౌకర్యం కల్పించారు సోనూసూద్. సింధూ దుర్గ్‌కి చెందిన స్వాప్నిల్ అనే అమ్మాయి గ్రామంలో ఇంటర్‌నెట్ లేకపోవడంతో ఆమె సోదరుడితో కలిసి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్న గుడిసె వేసుకుని ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ పరీక్ష కోసం సిద్దం అవుతోంది. చదువు కోసం స్వాప్నిల్ పడుతున్న కష్టాలను సైతం మీడియా కూడా ప్రచురితం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న సోనూసూద్ ఈ గ్రామానికి వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకుని ఆ ఊరికి వైఫై ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు. సోనూసూద్ నిర్ణయంపై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.