దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఎక్కువ ప్రభావం చూపింది మాత్రం వలస కార్మికుల పైననే.! రోజూ పనికి పోతే కానీ నాలుగు వేళ్లు లోనికి వెళ్లని పరిస్థితులు వారివి. లాక్ డౌన్ కారణంగా పనులు ఏమీ లేకపోవడం.. తలదాచుకోడానికి ఏమీ లేకపోవడం.. తినడానికి తిండి లేకపోవడం.. సొంత ఊళ్లకు పోవాలంటే ఏ సదుపాయం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాలు, దాతలు ఎంతో కొంత సహాయం చేయడంతో ఇన్నాళ్లూ ఎలాగోలా గడిపేశారు.

మార్చి 24 నుండి లాక్ డౌన్ ను అమలు చేశారు. దీంతో ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోయారు. స్పెషల్ గా అనుమతులు ఉంటేనే ఇన్నాళ్లూ వాహనాలు తిరిగాయి. తాజాగా లాక్ డౌన్ 3.0 అమలు అవుతోంది. ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వలసకూలీలను వారి వారి గ్రామాలకు పంపే ఏర్పాట్లు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పనిని చేస్తున్నాయి. బస్సుల్లోనూ, ట్రైన్ లలోనూ సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుని మరీ తరలిస్తూ ఉన్నారు.

తాజాగా వలస కార్మికులను ఛార్జీల డబ్బు కట్టాలని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తినడానికి తిండి కూడా లేని వలస కార్మికులను టికెట్ డబ్బులు ఎలా అడుగుతారని కాంగ్రెస్ పార్టీ నిరసన గళం ఎత్తింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ వలస కార్మికుల టికెట్ డబ్బులు కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని తెలిపింది.

ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన చాలా మందిని సొంత ఊళ్లకు తరలిస్తోంది.. కానీ వలస కార్మికుల దగ్గరనే ఎందుకు టికెట్ డబ్బులు కావాలని అడుగుతోందో తమకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.

ప్రభుత్వం తాము చేసిన ఈ పనిని సమర్థించుకుంది. తాము టికెట్ డబ్బులు వసూలు చేయడం ద్వారా నిజంగానే ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళే.. తమ సొంత ఊళ్లకు వెళ్ళాలి అనుకుంటారని.. లేకపోతే చాలా మంది వచ్చి సొంత ఊళ్లకు వెళ్లాలని కోరే అవకాశం ఉందని చెబుతోంది. రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ లోకల్ న్యూస్ పేపర్ తో మాట్లాడుతూ.. ఈ సర్వీసును ఫ్రీగా అందిస్తే అవసరమైన వాళ్ళను జల్లెడ పట్టడం కష్టం అవుతుందని అన్నారు. ఇతర రాష్టాలలో ఇరుక్కుపోయిన విద్యార్థులకు, వలస కూలీల కోసమే ఈ ఏర్పాట్లు చేశామని అన్నారు.

ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది మానవత్వం లేని చర్యగా అభివర్ణించారు. రోజువారీ కూలీలకు చాలా రోజులుగా ఎటువంటి ఉపాధి కూడా లేని సంగతి తెలిసిందే..! అలాంటి వాళ్లకు ట్రైన్ టికెట్ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయో సమధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

వలస కార్మికుల కోసం పనిచేసే ఆజీవిక బ్యూరో అనే ఎన్.జి.ఓ. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. చాలా మంది కూలీలకు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవని అన్నారు. చాలా మందికి టికెట్ రేటు 800రూపాయల వరకూ ఉందని.. కొన్ని కొన్ని రూట్లకు వెళ్లేవారితో సర్ ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నారట. సాధారణంగా రోజు వారీ కూలీలు.. 200 నుండి 600 రూపాయల వరకూ సంపాదిస్తారు. అది కూడా వాళ్ళ పనిని బట్టి దినసరి కూలీలో తేడాలు ఉంటాయి.

లాక్ డౌన్ అమలు చేయడం మొదలైనప్పటి నుండే చాలా మందికి తినడానికి భోజనం కూడా లేదని.. కేవలం ఒకటి రెండు రోజులకు సరిపడా రేషన్ సరుకులు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయని స్వాన్ సంస్థతో రోజువారీ కూలీలు తెలిపారు. 80 శాతం మందికి పైగానే లాక్ డౌన్ అమలు అయ్యాక ఎటువంటి సంపాదన లేదట. చిన్న చిన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగం ఇలా చాలా వాటిపై లాక్ డౌన్ ప్రభావం పడింది.

ఆయా కంపెనీలు రోజువారీ కూలీలను ఆదుకోకుండా చేతులు ఎత్తేశాయి. తమ కంపెనీల దగ్గరే సరైన ఫండ్స్ లేవని.. ఇక వారికి ఎక్కడ నుండి డబ్బు తీసుకుని రావాలి అంటూ ప్రశ్నించాయి సంస్థల యాజమాన్యాలు. భారత ఆర్థికరంగానికి రోజువారీ కూలీల భాగస్వామ్యం మరువలేనిది. దాదాపు 100మిలియన్ల రోజువారీ కూలీల జీవితాలు ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారయ్యాయట.

లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ప్రభుత్వం భావించింది. కానీ ముందస్తు ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ ను అమలు చేయడం కారణంగా ఎంతో మందిపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్