నల్లగొండ జిల్లాలో దారుణం.. కన్నతల్లిని సాకలేక సజీవ దహనం
By తోట వంశీ కుమార్ Published on 27 May 2020 11:45 AM IST
సమాజంలో మానస సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. నవమాసాలు మోసి పెంచి పెద్దచేసిన కన్న తల్లి మంచం పడితే.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి తల్లి పట్లే కాలయముడిగా మారాడో కొడుకు. కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మ(55)కు లింగస్వామి అనే కొడుకు ఉన్నాడు. బతుకు దెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో పదిరోజుల క్రితం లింగస్వామి స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటున్నాడు. చేసేందుకు పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. తల్లిని పోషించడం తలకు మించిన బారంగా బావించిన అతను మంగళవారం రాత్రి నిద్రిస్తున్న తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. శాంతమ్మ సజీవదహనం అయ్యింది. తల్లిని సాకలేకనే లింగస్వామి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.