మితిమీరుతున్న ఐఏఎస్ అధికారుల సోషల్ మీడియా పబ్లిసిటీ క్రేజ్

By అంజి  Published on  2 March 2020 9:30 AM GMT
మితిమీరుతున్న ఐఏఎస్ అధికారుల సోషల్ మీడియా పబ్లిసిటీ క్రేజ్

ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెర వెనుకే ఉండి పనిచేసేవారు. బయటికి పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి రోజూ పేపర్లలో కనిపిస్తున్నారు. విలేఖరులతో సంభాషిస్తున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఈ పబ్లిసిటీ క్రేజు ఇప్పుడు సోషల్ మీడియాకూ పాకింది.

చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మంచి పోస్టింగ్ ల కోసం, ప్రభుత్వం దృష్టిలో పడేందుకు, మంత్రులను మెప్పించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణలోని చాలా మంది ఐఏఎస్ , ఐపీఎస్ లు ప్రైవేటు పీఆర్ ఏజెన్సీలను కూడా పనికి కుదుర్చుకున్నారు. అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన పీఆర్ఓలు మామూలుగా కార్యక్రమాల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూండగా, ఈ ప్రైవేటు పీ ఆర్ ఓలు మాత్రం ఇమేజీ బిల్డింగ్ కోసం, పాపులారిటీ కోసం పోస్టులు పెడుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలోని మానవీయ కోణాన్ని, వారిలో పర్యావరణ స్పృహను, స్వచ్ఛత కోసం ప్రయత్నాలను, సాహస యాత్రలను గురించి చెప్పేందుకు ఈ ప్రైవేటు పీ ఆర్ ఓ లను ఉపయోగించుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ , టంబర్, స్నాప్ చాట్ వంటి మీడియాలను ఎంచుకుంటున్నారు.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం చాలా మంది ఆఫీసర్లు నెలకు రూ. 5 నుంచి 10 లక్షల వరకూ ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు. దాదాపు పది మంది ఆఫీసర్లు ఈ రకంగా చేస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీ ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.

అయితే ఈ ప్రక్రియ ఒక్కొ సారి మొదటికే మోసం తెచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలే ఒక మహా యాక్టివ్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ను ఒక కేంద్ర మంత్రి తన వ్యక్తిగత అధికారిగా నియమించుకోవాలని భావించారు. ఆమె పేరును కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం కూడా జరిగింది. అయితే ఆమె విషయంలో హోం శాఖ రెండు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఒకటి ఆమె ఫేస్ బుక్ లో చాలా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తున్నారు. రోజులో చాలా సేపు సోషల్ మీడియాలో ఉంటున్నారు. అసలు పనిని మానేసి ఈ పనిని చేయడం సరైనది కాదని హోం శాఖ చెప్పినట్టుగా తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే సదరు అధికారిణి తన కులానికి చెందిన వాట్సప్ గ్రూపుల్లో చాలా యాక్టివ్ గా ఉంది. అందరినీ సమానంగా చూడాల్సిన అధికారి ఇలా చేయడం సరికాదని హోం శాఖ అమె పేరును తిరస్కరించింది.

Next Story