మంచు దుప్పటిలో కేదార్‌నాథ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 10:17 AM ISTకేదార్‌నాథ్ ఆలయం మంచు దుప్పటి కప్పుకుంటోంది. హిమాలయాల్లో కొలువై ఆరునెలలపాటు భక్తుల పూజలందుకున్న మహాదేవుడు దేవతల సేవలందుకోవటానికి సిద్ధమయ్యాడు. ప్రతి ఏడూ శీతాకాలంలో ఆలయాన్ని మూసివేయడం ఆచారంగా వస్తోంది. దీంతో శివుడి విగ్రహాన్ని పూలతో అలంకరించిన పల్లకిలో ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. వచ్చే ఆరునెలలపాటు శివుడికి అక్కడ అర్చనలు చేస్తారు.
దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్‌నాథ్. ఈ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్‌నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా మారుతుంది.
మహాదేవుడు వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారని ప్రతీతి. ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది. తిరిగి వ్రుశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వ్రుశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మూసి వేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో గాని, నవంవబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది