'మహానగరాలకు నిద్ర కరువు'.. కావాలనే అర్థరాత్రి కాలక్షేపం

By అంజి  Published on  28 Feb 2020 11:17 AM GMT
మహానగరాలకు నిద్ర కరువు.. కావాలనే అర్థరాత్రి కాలక్షేపం

ముఖ్యాంశాలు

  • నిద్రలేమి రాత్రులు గడుపుతున్న నగరాల ప్రజలు
  • నిద్రలేమి సమస్యల్లో హైదరాబాద్‌ 3వ స్థానం
  • ది సెంచురీ మాట్రెసెస్‌ సంస్థ సర్వే

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐపాడ్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులతో దేశంలోని మహానగరాల ప్రజలు నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారు. మహానగరాల్లో ఇప్పుడు కంటి నిండా నిద్ర కరువైంది. ఒకప్పుడు ఇంటి నట్టింట్లో మాత్రమే ఉండే ఈ వస్తువులు.. ఇప్పుడు పడుకునే సమయంలో బెడ్‌పైకి చేరి.. నిద్రలేకుండా చేస్తున్నాయి. దీంతో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు నిద్రలేమికి గురవుతున్నట్లు ది.సెంచురీ మాట్రెసెస్‌ అనే సంస్థ నిర్వహించిన స్లీపింగ్‌ ట్రెండ్స్‌ సర్వేలో ఇది వెల్లడైంది.

నిద్రలేమి సమస్యల్లో దేశంలోనే హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో సుమారు 54 శాతం మంది సుమారు ఐదు నుంచి ఆరు గంటల నిద్రకు దూరం అవుతున్నారు. చాలా మంది సిటిజన్లు అర్థరాత్రి 12 దాటినా టీవీ షోలు చూడడం, మొబైల్‌ ఫోన్లు వాడడం, సోషల్‌ మీడియాలో కనిపించే కొత్త సమాచారాన్ని తెలుసుకుంటూ నిద్రపోవడం లేదని ఈ సర్వేలో తెలిసింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ సమస్య 75 శాతంగా ఉండగా, రాజధాని ఢిల్లీలో 73 శాతంగా ఉంది. ఎలక్ట్రానికి వస్తువులు యువత రాత్రి సమయాల్లో కుస్తీ పడుతున్నారు. బెంగళూరులో నిద్రలేమి సమస్యలు 50 శాతంగా ఉండగా.. పూణేలో 49 శాతం మంది రాత్రి సమయాల్లో నిద్రపోవడం లేదట.

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సెంచురీ మాట్రెసెస్‌ ఈ సర్వే నిర్వహించింది. స్లీపింగ్‌ ట్రెండ్‌పై అంటూ నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 10 వేల మంది నుంచి ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించారు. ప్రధానంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌, ట్విటర్‌లాంటి సోషల్‌ మీడియా యాప్స్‌లో వస్తున్న కొత్త ఫీడ్‌ బ్యాక్‌ను చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ నిదురపోవడం లేదని ఈ సర్వేలో తేలింది. కొందరు రాత్రి లేటుగా పడుకున్న ఉదయం మాత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలోనే లేవాల్సి వస్తోందని పలువురు ఈ సర్వేలో చెప్పారట. ఇక పని ఒత్తిడి, ఉద్యోగాలు, దూర ప్రయాణాలు చేయడం వల్ల.. 37 శాతం మంది ఆఫీసుల్లో, ప్రయాణాల్లో కునికిపాట్లు తీసున్నారని సర్వలే తెలిసింది.

ఎలక్ట్రానిక్‌ వస్తువులను అవసరాన్ని బట్టి వాడడమే మేలు అని, గంటలకు తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే వాటి నుంచి వెలువడే రేడియేషన్‌ వల్ల కంటి చూపు దెబ్బతింటుందని సరోజనిదేవీ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌ గౌడ్‌ తెలిపారు.

Next Story