Fact Check : అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నారింజ, ఎరుపు రంగుల్లోకి మారిపోయిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Sep 2020 4:36 AM GMT
Fact Check : అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నారింజ, ఎరుపు రంగుల్లోకి మారిపోయిందా..?

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని చాలా ప్రాంతాల్లో ఆకాశం ఎరుపు రంగులోనూ, నారింజ రంగులోనూ కనిపిస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

భయభ్రాంతులకు గురి చేసేలా ఆ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. నిజంగానే ఆకాశం అలా ఉందా..? లేక ఏదైనా ఎడిటింగ్ చేసిన వీడియోనా అని పలువురు సామాజిక మాధ్యమాల్లో అడుగుతూ ఉన్నారు.

'సెప్టెంబర్ 8, 2020న డౌన్ టౌన్ స్టేటన్(ఒరేగాన్) లో 12:22పి.ఎం. సమయంలో ఇలాగే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ..!' అని పలువురు ట్వీట్లు చేస్తూ వస్తూ ఉన్నారు.



తాము ఎటువంటి ఫిల్టర్ ను ఉపయోగించలేదని.. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ఈ పరిస్థితి చోటుచేసుకుందని అన్నారు.



చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. ఎంతో మంది ఈ ఫోటోలు నిజమా కాదా అని అనుమానాలు వ్యక్తం చేశారు.

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు నిజమే.! అమెరికా లోని ఒరేగాన్ ప్రాంతంలో ఆకాశంలో ఈ మార్పులు నిజంగానే చోటు చేసుకుంది.

వాషింగ్టన్, ఒరేగాన్, కాలిఫోర్నియా రాష్ట్రాలలో కార్చిచ్చు కారణంగా పెద్ద ఎత్తున అడవిలో మంటలు చెలరేగాయి. దీనికి వడగాలులు తోడవడంతో ఆ ప్రాంతమంతా విపరీతమైన వేడితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగ నిండిపోయింది.

దాదాపు 35 ప్రాంతాల్లో అడవులు తగలబడ్డాయని.. మూడు లక్షల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం దగ్ధమైందని చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని NY Times కథనాన్ని ప్రచురించింది.

సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 9, 2020లలో భారీ ఎత్తున అడవుల్లో మంటలు చెలరేగడంతో చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగ అమలుకుంది. చూడడానికి ఆ ప్రాంతాలు ఏదో యుగాంతం లాగా తలపించాయి.

ఒరేగాన్ రాష్ట్రంలో 5 లక్షల మందిని ఖాళీ చేయాలని అక్కడి అధికారులు ఆదేశించారు. అక్కడి జనాభాలో ఇది 10 శాతం కావడం గమనార్హం. సెప్టెంబర్ 5 ఉదయం ప్రారంభమైన ఈ మంటల కారణంగా ఇప్పటివరకు సుమారు 2000 ఇళ్లు, ఇతర బిల్డింగులు అగ్నికి ఆహూతి అయ్యాయి. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అసాధారణమైన వేడి, ఎముకల్ని పిప్పిచేసేంత ఉక్క, తీవ్రమైన వడగాల్పులతో ఆ ప్రాంతమంతా అతలాకుతలం అవుతోంది. కార్చిచ్చు నుండి వెలువడిన పొగకు సూర్యుడి ఎండ కూడా పడడం కారణంగా ఆకాశం ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది.

The Independent మీడియా సంస్థ యూట్యూబ్ లో వీడియోలను పోస్టు చేసింది. చాలా ప్రాంతాల్లో ఆకాశం ఎరుపు, నారింజ రంగుల్లో ఉందని తెలిపింది.

న్యూస్ మీడియా ఆకాశంలో ఇలా మార్పులు వచ్చిన సంగతి నిజమేనని చెబుతోంది.

అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం ఎరుపు, నారింజ రంగుల్లో మారడం 'నిజమే'.

Next Story