ఎస్కేయూ వీసీ జయరాజ్‌ హఠాన్మరణం..!

By అంజి  Published on  9 Dec 2019 3:41 AM GMT
ఎస్కేయూ వీసీ జయరాజ్‌ హఠాన్మరణం..!

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ జయరాజ్‌ గుండెపోటుతో ఆదివారం రాత్రి హఠాన్మరణం చెందారు. జయరాజ్‌ అనంతపురం నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు కర్నూలు జిల్లా డోన్‌ వద్దకు రాగానే జయరాజ్‌ ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. జయరాజ్‌ను వెంటనే ప్రయాణికులు డోన్‌ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా జయరాజ్‌ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

ఎస్కేయూలో 1987 సంవత్సరంలో జయరాజ్‌ లెక్చరర్‌గా చేరారు. జయరాజ్‌కు రీసెర్చ్‌, అడ్మినిస్ట్రేషన్‌, బోధన వృత్తిలో 31 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 2019 అక్టోబర్‌ 26న ఎస్కేయూ వీసీ బాధ్యతలు స్వీకరించిన జయరాజ్‌.. 2012లో రాష్ట్ర ఉత్తమ ఆచార్య అవార్డును అందుకున్నారు. ఓ సీనియర్‌ ఆచార్యుడికి పూర్తి స్థాయి బాధ్యతలతో కూడిన వీసీగా అవకాశం దక్కడం వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా జయరాజ్‌కు దక్కింది.

మొదట ఆర్థిక శాస్త్ర విభాగం అధిపతిగా, సోషియల్‌ సైన్సెస్‌ డీన్‌, రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా జయరాజ్‌ పని చేశారు. ఆ తర్వాత వివిధ హోదాల్లోనూ పని చేశారు. అనంతపురంలో బహుజన రచయితల సంఘం నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగింది. జయరాజ్‌ మృతితో విద్యారంగ వేత్తలు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Next Story