పాకిస్థాన్ లో హాట్ టాపిక్ గా నిలిచిన 'సింధూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2020 1:55 AM GMTఎంతో మంది తీవ్రవాదులకు కొన్నేళ్ళుగా అండగా నిలిచింది పాకిస్థాన్. ప్రపంచంలో ఏ మూలన తీవ్రవాదం పేరు వినిపించినా ఆ మూలాలు పాకిస్థాన్ దాకా వెళ్ళేవి. ప్రపంచాన్ని గడగడలాడించిన బిన్ లాడెన్ ఎంతో హాయిగా ప్రశాంతంగా పాకిస్థాన్ లో ఉన్నాడంటే మామూలు విషయం కాదు.. తీవ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామం అని ఈ ఒక్క ఘటన గురించి తెలిస్తే చాలని ఎంతో మంది అంటూ ఉంటారు.
పాకిస్థాన్ ఓ వైపు కాశ్మీర్ తమది అంటూ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే.. ప్రత్యేకమైన బలూచిస్తాన్ కావాలని, సింధూదేశం కావాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ లో సింధూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ పేరు హాట్ టాపిక్ గా నిలిచింది.
పాకిస్థాన్ లోని జకోబాబాద్, శిఖర్పూర్ లోని పాక్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ పై గ్రెనేడ్ దాడి జరగ్గా.. అది చేసింది తామేనని సింధూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ సింధూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ ప్రకటించింది.
సింధ్ ప్రాంతంపై పాకిస్థాన్ ప్రభుత్వం పెత్తనాన్ని మానుకోవాలని సింధూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కలిగేంత వరకు పోరాటం ఆగదని ప్రకటించింది.
ఆగష్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో సింధీ ప్రజలు ఆరోజు ర్యాలీలకు దూరంగా ఉండాలని కోరింది. సింధు దేశ్ ను సాధించే వరకూ పోరాడుతూనే ఉందామని అంటున్నారు. గత నెలలో బలూచ్, సింధీ ప్రజలు ఒక్కటిగా ఓ గ్రూపును మొదలుపెట్టారు. తమ ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం చేస్తున్న నేరాలు, ఘోరాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
అందులో భాగంగానే పాకిస్థాన్ సైన్యంపై ఈ దాడులు మొదలయ్యాయి. బలోచిస్తాన్, సింధ్ వేర్పాటు వాదులంతా ఇటీవల ఒక్కటై పలు ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను మొదలుపెట్టారు. పాకిస్థాన్ నుండి వేరు పడడమే తమ లక్ష్యాలని ఈ గ్రూపులు నిర్ణయించుకున్నాయి.