ఐపీఎల్ ఆడితేనే ధోని రీఎంట్రీ.. లేకుంటే రిషబ్ పంత్‌కే ఛాన్స్
By తోట వంశీ కుమార్ Published on 12 April 2020 5:08 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్‌లో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఫామ్‌ను నిరూపించుకుంటేనే తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దు అయితే మాత్రం ధోని కెరీర్ ముగిసినట్లేనని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్.
తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ తరువాత నుంచి ధోని ఇంతవరకు టీమ్ఇండియా జెర్సీ ధరించలేదు. ప్రస్తుతం ధోని ఫాంలో ఉన్నాడా లేడా అనే విషయం ఎవరికి తెలీదు. ఐపీఎల్ సీజన్‌లో తన ఫామ్ నిరూపించుకుంటే.. మాత్రం జట్టులోకి తప్పక ఎంపిక అవుతాడు. కానీ ఒకవేళ ఐపీఎల్ రద్దు అయితే.. మాత్రం ఇక ధోని టీమ్ఇండియా తరుపున ఆడే అవకాశాలు చాలా తక్కువ.
ఒకవేళ ప్రస్తుతం తానే సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే.. ఏం చేస్తాననే విషయాన్ని మాత్రమే చెప్పాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పాడు. 'వరల్డ్ కప్‌లో పాల్గొనే టీమ్ఇండియా ఎంపిక వ్యక్తులను బట్టి జరగదని.. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ధోని దాదాపు సంవత్సర కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ తన ఫస్ట్ చాయిస్ అని, కేఎల్ రాహుల్ ఇటీవల కీపింగ్‌లో కూడా రాణిస్తున్నా.. తన ఫస్ట్ చాయిస్ మాత్రం పంత్ అని స్పష్టం చేశాడు. పంత్ కు ఎంతో ప్రతిభ ఉండడమే ఇందుకు కారణమని తెలిపాడు. ఇక ఐపీఎల్ జరగకుంటే మాత్రం ధోని పేరును చర్చకే తీసుకోనని'
కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.
టీమ్ఇండియా మొట్టమొదటి సారి 1983లో వరల్డ్ కప్ గెలిచింది. ఆ ప్రపంచకప్ గెలిచిన జట్టులో టీమ్ సభ్యుడిగా ఉన్నాడు శ్రీకాంత్. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరనున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ జట్టులో ధోని ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.