ఈ త‌రానికి ధోని 'ఒక్క‌డే'..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2020 1:45 PM GMT
ఈ త‌రానికి ధోని ఒక్క‌డే..

భారత క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో లికించుకున్నాడు భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని. టీమ్ఇండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు(2007 టీ20, 2011 ప్ర‌పంచ‌క‌ప్‌) లు అందించిన కెప్టెన్‌గా అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

చేజింగ్‌లో ధోని ప్ర‌త్యేక‌తే వేరు ఎలాంటి క్లిష్ట స‌మ‌యాల్లోనైనా త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో టీమ్ఇండియాకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించాడు. అయితే.. ఇదంతా గ‌తం. ధోనిలో మునుప‌టి ప‌దును త‌గ్గింద‌నేది కాద‌న‌లేని వాస్తవం. అప్ప‌టిలా ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌లు ఆడ‌లేక‌పోతున్నా.. జ‌ట్టుకు ధోని అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అంటున్నారు క్రీడా పండితులు.

ఇక ధోని లాంటి ఆట‌గాడు త‌రానికి ఓసారి మాత్ర‌మే ఉంటాడ‌ని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌. ధోని పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావ‌ద్ద‌ని అంటున్నాడు. ఇటీవ‌ల ధోనీ రిటైర్‌మెంట్ పై వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో హుస్సేన్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ధోనికి రిటైర్‌మెంట్ పై ఎవ‌రు మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించాడు. ధోని లాంటి ఆట‌గాడికి తాను ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసున‌ని పదే ప‌దే ఇదే వ్యాఖ్య‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌న్నాడు. ధోని లాంటి క్రికెటర్లు తరానికి ఒకసారి మాత్రమే వస్తారని.. ఏమైనా ఊహించని ఒత్తిడి వల్ల ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తే అతని మళ్లీ తీసుకురాగలరా అంటూ ప్ర‌శ్నించాడు.

భార‌త జ‌ట్టు త‌రుపున ధోని మ‌ళ్లీ రీఎంట్రీ సులువుగా ఇవ్వ‌గ‌ల‌డు. భార‌త క్రికెట్‌కు ఎన‌లేని సేవ‌లు అందించాడు. ప్ర‌పంచ‌క‌ప్ లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జ‌ట్టుకు గెలిపించ‌లేక‌పోవ‌చ్చు.. కానీ అలాంటి సంద‌ర్భాలు ధోని కెరీర్‌లో ఒక‌టి, రెండు మాత్ర‌మే ఉన్నాయి. అత‌నిలో గొప్ప నైపుణ్యం ఉంది.

ధోని గురించి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా మాట్లాడండి. ఒక సారి అత‌ను ఆట‌కు గుడ్ బై చెబితే.. తిరిగి రాడు. ధోని లాంటి క్రికెట‌ర్లు త‌రానికి కొద్ది మంది మాత్ర‌మే ఉంటారు. ధోని మ‌న‌సులో ఏముందో అత‌డికి మాత్ర‌మే తెలుసున‌ని నాజ‌ర్ అన్నాడు.

భార‌త జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ధోని ఖ‌చ్చితంగా రాణించాల‌ని టీమ్ఇండియా కోచ్ ర‌విశాస్త్రి ఇటీవ‌ల వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఐపీఎల్ లో స‌త్తా చాటి త‌న రీఎంట్రీ ని ఘ‌నంగా ఇవ్వాల‌ని ధోని బావించాడు. అందుకు త‌గ్గ‌ట్లుగా ఐపీఎల్ ప్రారంభానికి నెల‌రోజుల ముందే ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. అయితే.. క‌రోనా దెబ్బ‌తో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) ఏప్రిల్ 15కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం ఉంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ జ‌ర‌గ‌డం అనుమానంగా మారింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్‌లో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ధోని పాల్గొన‌డం అంతా బీసీసీఐ చేతుల్లోనే ఉంది. మ‌రీ బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Next Story