టెస్టు క్రికెట్‌పై శ్రేయాస్ కన్ను.. తెలుగు క్రికెటర్‌కు ముప్పు తప్పదా..?
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 8:57 PM ISTపరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియా ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న నెం.4 సమస్యను తీర్చిన ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ యవరాజ్ సింగ్, సురేష్ రైనా తరువాత ఆ స్థానంలో టీమ్ మేనేమ్‌మెంట్ ఎంతో మంది ఆటగాళ్లను ఆడించింది. అయితే ఎవరూ కూడా ఆస్థానానికి న్యాయం చేయలేకపోయారు. తెలుగు తేజం అంబటి రాయుడు ఆశలు కలిగించినా.. వన్డే ప్రపంచ కప్ నాటికి ఫామ్ కోల్పోయాడు.
దీంతో ప్రపంచకప్ జట్టులో రాయుడుకు అవకాశం దక్కలేదు. ఇక ప్రపంచకప్ లీగ్ మ్యాచుల్లో ఓపెనర్లు రాణించడంతో విజయాలు సాధించిన టీమ్ఇండియా.. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతుల్లో చితైంది. ఆ మ్యాచ్ ఓటమికి నెంబర్.4 బ్యాట్స్ మెన్ లేకపోవడమే కారణమని పలువురు క్రీడాపండితులు పేర్కొన్నారు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా భాగస్వామ్యాల్ని నిర్మించడంతో పాటు స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్‌మెన్ కోసం భారత్ సుదీర్థకాలం నిరీక్షించింది. ఎట్టకేలకి ఈ నిరీక్షణకి తెరదించుతూ గత ఏడాది ఆఖర్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయాస్ అయ్యర్.. ఆ స్థానానికి తాను తగిన క్రికెటర్‌గా నిరూపించుకున్నాడు.
ఇప్పటికే టీ20, వన్డేల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న ఈ యువ క్రికెటర్.. త్వరలోనే టెస్టు ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే క్రికెట్ టోర్నీలన్నీ రద్దవగా.. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్ మెన్. సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని టెస్టుల్లో అరగ్రేటంపై ప్రశ్నించాడు. ‘‘క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్ అత్యుత్తమం. ప్రతి క్రికెటర్‌కి టెస్టులు ఆడాలనేది ఓ కల. నేను కూడా టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని శ్రేయాస్ అయ్యర్ సమాధానమిచ్చాడు.
ఒకవేళ శ్రేయాస్ టెస్టుల్లోకి వస్తే ఏ స్థానంలో ఆడతాడు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవలే టెస్టుల్లో ఓపెనర్ అవతారం ఎత్తిన రోహిత్ శర్మ తో పాటు మయాంక్ అగర్వాల్ లు మంచి శుభారంభాలను ఇస్తున్నారు. వీరితో పాటు రిజర్వ్ ఓపెనర్ పృథ్వీ షా అందుబాటులో ఉన్నాడు. వన్‌డౌన్‌లో టెస్టు స్పెషల్ ఛతేశ్వర పుజారా ఆడుతుండగా.. నాలుగో స్థానంలో కెప్టెన్ కోహ్లీ, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఆడుతున్నారు.
ప్రస్తుతం టీమ్‌లో వీరి ప్లేస్ ఖాయం. ఇక మిగిలింది ఆరో స్థానం మాత్రమే. ప్రస్తుతం ఈ స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఆడుతున్నాడు. కాగా పరిస్థితులకు అనుగుణంగా ఈ క్రికెటర్‌కి జట్టులో చోటు దక్కుతుంది. ఒకవేళ శ్రేయాస్ గనుక టెస్టుల్లో అరగ్రేటం చేస్తే హనుమ విహారి స్థానం గల్లంతు అవ్వడం ఖాయం. ఎందుకంటే.. ఇన్నింగ్స్‌ను నిర్మించడంతో పాటు చివర్లో హిట్టింగ్ చేయగలడం శ్రేయాస్‌కు అదనపు బలం. ఇప్పటికిప్పుడు తెలుగు క్రికెటర్ వచ్చిన నష్టం ఏం లేకపోయినా.. వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో పరిణితి సాధిస్తున్న శ్రేయాస్ అయ్యర్ నుంచి భవిషత్యులో ముప్పు తప్పకపోవచ్చు.