అమెరికాలో కాల్పుల కల్లోలం.. ఆరుగురు మృతి
By అంజి
అమెరికాలో మరోసారి కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ 50 ఏళ్ల వ్యక్తి మెల్సన్ కూర్స్ కంపెనీలోకి చొరబడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆ తర్వాత నిందితుడు తనకు తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం మిల్‌వాకీ నగరంలోని మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలో జరిగింది. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి.. గతంలో అదే కంపెనీలో మాజీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు.
నిందితుడిని గతంలో కొన్ని కారణాల వల్ల ఉద్యోగం నుంచి ఆ సంస్థ యాజమాన్యం తొలగించినట్లు సమాచారం. ఆ సంస్థలో పని చేసే వేరే ఉద్యోగి ఐడీ కార్డు దొంగిలించి నిందితుడు కంపెనీలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారని మిల్‌వాకీ మేయర్ టామ్ బారట్ తెలిపారు. ఉద్యోగం నుంచి పోయిందన్న కారణంతోనే నిందితుడు కాల్పులు జరిపాడని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఓ సమావేశంలో మాట్లాడుతున్న ఆయన.. కాల్పుల ఘటనలో ఐదుగురు తమ ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో కంపెనీ కాంప్లెక్స్‌లో సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు.