టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తా : అక్తర్
By తోట వంశీ కుమార్ Published on 5 May 2020 1:25 PM ISTభారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేయాలని ఉందని అక్తర్ అన్నాడు. తాజాగా హలో యాప్‌లో లైవ్ సెషన్ లో అక్తర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్తర్ తన మనసులోని మాటలను బయటపెట్టడంతో పాటు ఆక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అభిమానులు అడిగిన పలు పశ్నలకు సమాధానం ఇచ్చాడు.
భారత జట్టకు బౌలింగ్ కోచ్‌గా మీకు అవకాశం వస్తే పని చేస్తారా..? అని ఓ అభిమాని అక్తర్‌ను ప్రశ్నించాడు. తప్పకుండా పని చేస్తా. భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేసేందుకు నాకేం అభ్యంతరం లేదు. నాకున్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇప్పుడు ఉన్న ఫాస్టు బౌలర్ల కన్నా.. మరింత వేగవంతమైన, కచ్చితత్వం ఉన్న బౌలర్లను తయారు చేస్తా. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకాశం వస్తే మాత్రం కేకేఆర్(కోల్‌కత్తా నైట్ రైడర్స్) తరుపున పని చేయాలని అనుకుంటున్నట్లు అక్తర్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ మొదటి సీజన్‌లో అక్తర్ కేకేఆర్ జట్టు తరుపున ఆడిన సంగతి తెలిసిందే.
భారత దిగ్గజ బ్యాట్స్ మెన్ సచిన్ టెండ్కూలర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. 1998లో మొదటిసారి సచిన్ కు బౌలింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. తనకు సచిన్ పేరు తెలుసని.. కానీ చెన్నైలో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్‌ను వారి దేశంలో క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారని అప్పుడే తెలుసుకున్నట్లు తెలిపాడు. ఇక భారత జట్టులో తనకు యువరాజ్ సింగ్‌తో పాటు హర్భజన్ సింగ్ మంచి స్నేహితులు అని చెప్పాడు. సచిన్‌తో పోలిస్తే ది వాల్ రాహుల్ ద్రావిడ్‌కు బౌలింగ్ చేయడం కష్టమన్నాడు. ఒకవేళ తనపై బయోపిక్ తీస్తే.. అందులో తన పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.