చెత్త రికార్డుతో ఆక‌ట్టుకున్న దూబే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Feb 2020 7:47 PM IST
చెత్త రికార్డుతో ఆక‌ట్టుకున్న దూబే..!

ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన‌ టీమిండియా యువ ఆల్‌ రౌండర్‌ శివం దూబే ఓ చెత్త రికార్డుతో ఆక‌ట్టుకున్నాడు. కివీస్‌తో జ‌రుగుతున్న‌ టీ20 సిరీస్‌లో ఇప్పటివరకూ ఏ విభాగంలోనూ రాణించ‌ని దూబే.. బౌలింగ్‌లో మాత్రం దారాళంగా ప‌రుగులిస్తూ విమ‌ర్శ‌కుల నోళ్ల‌కు ప‌నిచెప్తున్నాడు.

ఇక‌ కివీస్‌తో ఈ రోజు జ‌రిగిన చివ‌రి టీ20లో దూబే ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా త‌రుపున‌ అత్యధిక పరుగులిచ్చిన బౌల‌ర్‌గా చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకూ ఆ రికార్డు స్టువర్ట్‌ బిన్నీ(32 పరుగులు) పేరిట ఉండగా.. ఇప్పుడు దూబే ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓవ‌రాల్‌గా స్టువ‌ర్ట్ బ్రాడ్ త‌ర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో దూబే వేసిన 10 ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ 34 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్‌లో సీఫెర్ట్‌-రాస్‌ టేలర్‌లు చెలరేగిపోయారు. నాలుగు సిక్స్‌లు.. రెండు ఫోర్లతో విధ్వంసం సృష్టించారు. ముందుగా సీఫెర్ట్‌ రెండు సిక్స్‌లు ఫోర్‌ కొట్టగా, అనంత‌రం టేలర్‌ కూడా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. అస‌లే బ్యాటింగ్‌లో విఫ‌ల‌మ‌వుతూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న దూబే.. చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌రోమారు హాట్ టాఫిక్ అయ్యాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.

Next Story