ముఖ్యాంశాలు

  • సీఎం సీటు కోసం శివసేన దూకుడు
  • పవార్‌తో సంజయ్ రౌత్ మంత్రాంగం
  • సోమవారం సోనియాతో పవార్ భేటీ
  • అలర్టైన బీజేపీ నేతలు

సీఎం సీటు విషయంలో శివసేన ఏమాత్రం తగ్గడం లేదు. అసరమైతేలైన్ దాటి కాంగ్రెస్ – ఎన్సీ కూటమికి లైన్ వేస్తాం అంటున్నారు శివ సైనికులు. ఈ విషయంలో శివసేన సంజయ్ రౌత్ రెండాకులు ఎక్కువే చదివారు. ఏకంగా పవార్‌ ఇంటికి వెళ్లి ఉద్దవ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు.సీటు ముఖ్యం సిద్ధాంతాలది ఏముంది..?తుడిచి వేస్తే పోతాయి అంటున్నారు శివ సైనికులు.

అక్టోబర్ 24న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కీచులాట మొదలైంది. కుర్చీ కోసం స్నేహితులైన బీజేపీ – శివసేనలు చిటపటలాడుతున్నాయి. బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుండగా..శివసేన మాత్రం రోజుకో స్టేట్‌మెంట్‌తో కమలనాధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.అంతేకాదు..శివసేన ఎంపీ సంజమ్ రౌత్ మాట్లాడుతూ..తాము తలచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఇండైరక్ట్‌గా కాంగ్రెస్ – ఎన్సీపీ మద్దతు తీసుకుంటామని చెప్పకనే చెప్పారు. అక్టోబర్ 24నే అంటే..ఒక పక్క ఫలితాలు వస్తున్నప్పుడే నేను చెప్పాను. బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయి. శివసేన సీఎం సీటు కోసం మొండికేసే అవకాశ ముందని. గోతికాడ నక్కల కూర్చున్న కాంగ్రెస్ -ఎన్సీపీ శివసేనకు మద్దతు ఇచ్చి ..కర్ణాటక ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తాయని కూడా చెప్పాను. ఇప్పుడు ఆ దిశగానే మహారాష్ట్రలో అడుగులు పడుతున్నాయి. శివసేన దూకుడు చూసిన బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు.

కాని..ఎంత కొట్టుకున్నా..తిట్టుకున్నా చివరి క్షణంలో బీజేపీ – శివసేన కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వారి బంధం విడదీయరానిది. బీజేపీని బ్లాక్‌ మెయిల్ చేయడానికే శివసేన ఎంపీ పవార్‌ను కలిశాడా? .పవార్ సోనియా దగ్గరకు ఎటువంటి రాయ ‘బేరం’ తీసుకెళ్తున్నారు. కర్ణాటక ఫార్ములా సక్సెస్ అవుతుందా?. కర్ణాటక ఫార్ములా ప్రకారం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే..శివసేనకు సీఎం సీటు ఇవ్వాల్సి ఉంటుంది. మంత్రి పదవులు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పంచుకోవాలి. ఇది కలగూర గంప ప్రభుత్వంలా ఉంటుంది. కాంగ్రెస్ – ఎన్సీపీలతో శివసేనకు సిద్ధాంత వైరుద్యం ఉంది. అధికారం కోసం కలిసినా తుమ్మితే ఊడిపోయే ముక్కులా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుంది.

మరోవైపు..శివసైనికులు తమ వారే అనే ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. అయినా.. జాగ్రత్తగానే పరిస్థితులను అంచనా వేస్తున్నారు. పనిలో పనిగా శివసేనను దారిలో తెచ్చుకోవడానికి రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని బయటకు తీశారు. నవంబర్ 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలనే అంటూ సంకేతాలు పంపారు. శివసేన మాత్రం రాజకీయ చదరంగం బాగానే ఆడుతుంది. ఈ రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదుపుతున్న శివసేన..లక్ష్యాన్ని అందుకుంటుందా..? బీజేపీ ఒడిలో వచ్చి కూర్చుంటుందా? శివసేనికుల మంత్రాంగానికి ..పవార్ చాణక్యం తోడై కర్ణాటక ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తారా..? ఏదిఏమైనా…బీజేపీని కాదు అనుకుని శివసేన ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తే..ఎక్కువ రోజులు మాత్రం ఉండదు.

– వై.వి.రెడ్డి,న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.