జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షింజో అబె
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 4:45 PM IST
జపాన్ ప్రధాని షింజో అబె తన పదవికి రాజీనా చేశారు. అనారోగ్య కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. షింజో అబె వయసు 65 సంవత్సరాలు. 2021 సెప్టెంబరు వరకు ప్రధానిగా ఆయన పదవీకాలం ఉంది. తన పదవీకాలం పూర్తి చేయలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తన అనారోగ్యం కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను గత కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
'ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపైప ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలిఉండగానే రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను' అని షింబో అబె తెలిపారు. జపాన్ లో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబె రికార్డు సృష్టించారు. ఎక్కువ కాలం1964 నుంచి 1972 వరకు 2,798 రోజులు ప్రధానిగా సేవలందించిన తన ముత్తాత ఐసాకు సాటో రికార్డును సోమవారంతో అధిగమించారు షింజో. దీంతో జపాన్ ప్రధానిగా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కారు.
షింజో అబె యుక్త వయస్సు నుంచే ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన 2007లో ప్రధాన మంత్రి పదవి నుంచి అర్థంతరంగా వైదొలిగారు. సంప్రదాయవాదిగా, జాతీయవాదిగా అబెకు పేరుంది. దూకుడైన ఆర్థిక విధానంతో జపాన్ అభివృద్ధిని ఉత్తేజితం చేసిన ఆయన ఆర్థిక విధానాలు 'అబేనామిక్స్'గా ప్రాచుర్యం పొందాయి. జపాన్ సైన్యాన్ని ఆయన బలోపేతం చేశారు. రక్షణ వ్యయాన్ని భారీగా పెంచారు. అయితే, రాజ్యాంగంలోని శాంతికాముక ఆర్టికల్ 9ను మాత్రం ఆయన మార్చలేకపోయారు.