స్ట్రైక్ తీసుకోమంటే తీసుకోడు.. ధావన్ ఓ ఇడియట్ : రోహిత్ శర్మ
By తోట వంశీ కుమార్ Published on 9 May 2020 1:00 PM ISTభారత క్రికెట్‌లో విజయవంతమైన ఓపెనింగ్ జోడిలలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ల జోడి ఒకటి. వీరిద్దరు కలిసి ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వార్నర్ అడిగిన పలు పశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. తన సహచర ఆటగాడు ధావన్‌తో కలిసి ఆడటం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇక వార్నర్ కూడా ధావన్‌తో కలిసి సన్ రైజర్స్ తరుపున ఇన్నింగ్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్.. శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ అనుభవం చెప్పాలని రోహిత్ ను అడిగాడు. 'ధావన్ ఓ ఇడియట్. మ్యాచ్‌లో తొలి బంతిని ఎదుర్కొనడానికి ఏ మాత్రం ఇష్టపడడని' రోహిత్ చెప్పాడు. '2013 లో అప్పుడే ఓపెనర్ గా అరంగ్రేటం చేశా. అది చాంపియన్ ట్రోఫి. తొలి సారి ఓపెనింగ్ కావడంతో ధావన్ దగ్గరికి వెళ్లి నువ్వు స్ట్రైక్ తీసుకో అని అడిగా. అయితే ధావన్ కు అది ఇష్టం ఉన్నట్లుగా లేదు. నువ్వు చాలా కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నావు రోహిత్.. నాకిది తొలి పర్యటన మాత్రమే.. కాబట్టి నువ్వే స్ట్రైక్ తీసుకో అని ధావన్ అన్నాడు. ఇక చేసేది ఏమీ లేక నేనే స్ట్రైక్ తీసుకున్నా. అది దక్షిణాఫ్రికాతో మ్యాచ్. తొలి ఓవర్‌ను మోర్నీ మోర్కెల్ వేశాడు. అతడు వేసిన తొలి మూడు బంతులు నాకు కనిపించలేదు. బౌన్సర్లు వేశాడు. తరువాత అక్కడి పరిస్థితి అలవాటు పడి.. సహజశైలిలో బ్యాటింగ్ చేశా'. ప్రస్తుతం ధావన్‌తో అంతా బాగానే ఉందన్నాడు హిట్‌మ్యాన్.
అయితే.. పరుగులు తీసే విషయంలో ధావన్‌తో కాస్త జాగ్రత్తగా ఉండాలని.. బాగా చికాకు తెప్పిస్తాడని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. బంతిని డిఫెన్స్ ఆడి పరుగు కోసం చెప్పాపెట్టకుండా వచ్చేస్తాడు. పరుగు కోసం వెళ్లాలో వద్దో నాకు అర్థం అయ్యేది కాదు. అందుకే బంతి గ్యాబ్‌లోకి వెళ్లిన్పపుడు మాత్రమే పరుగు తీసేవాడిని.. ఇక స్ట్రైక్ రొటేషన్ విషయంలో ధావన్‌తో కాస్త కష్టంగానే ఉంటుందని, దీంతో చాలా పరుగులు తీసే అవకాశాలను కోల్పోయానని.. కానీ ఎన్నడూ బాధపడలేదని తెలిపాడు రోహిత్.
హిట్‌మ్యాన్‌తో వార్నర్ అంగీకరించాడు. ధావన్‌తో కలిసి సన్‌రైజర్స్ తరుపున ఓపెనింగ్ చేసినప్పుడు తాను కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వార్నర్ చెప్పాడు.