చేతిలో చెయ్యి వేసే ప్రసక్తే లేదు!!

By సుభాష్  Published on  16 March 2020 8:22 AM GMT
చేతిలో చెయ్యి వేసే ప్రసక్తే లేదు!!

“చేయి చేయి కలుపుదాం... చేతనైంది చేద్దాం..”... “నీ చేయీ నా చేయీ పెనవేసి బాస చెయ్యి” “ చేతిలో చెయ్యేసి చెప్పు బావా”.... ఇలాంటి పాటలు ఇప్పుడు అస్సలు వద్దు. చేతులు కలిస్తే దోస్తీ కాదు... సుస్తీ వస్తుంది. కరోనా కరాల నుంచి కరానికి వ్యాపించి నానా వికారాలు కలిగిస్తుంది. కర చాలనం అంటే కరోనా చలనమే....కాబట్టి సావధాన్ ....చేతులు కలపకండి.

అందుకే ఇప్పుడు ప్రపంచం కొత్త కొత్త పద్ధతుల్లో ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఎంత పెద్ద వారైనా, ఎంత గొప్పవారైనా కరచాలనం చేయడం లేదు. కావలసినంత దూరంలో నిలబడి సంభాషించుకుంటున్నారు. చైనాలో కరోనా వికరాళ నృత్యం చేసే సమయంలో ఇద్దరు చైనీయులు ఒళ్లంతా జాకెట్లు ధరించి, చేతులకు గ్లవ్స్, మూతులకు మాస్కులు ధరించి కేవలం కాళ్లతో ఒకరినొకరు తాకి కరోనా ను వెక్కిరించారు. ఇది వైరల్ అయిపోయింది. దీంతో పలువురు దేశాధినేతలు కూడా కరచాలనం కన్నా పాద చాలనమే ముద్దని నిర్ణయించేసుకున్నారు. టాంజానియా దేశాధ్యక్షుడు జాన్ మగుఫులి తన మంత్రివర్గ సహచరుడిని కాలితో కాలు తాకి పలకరించాడు. రష్యన్ మంత్రి అలెగ్జాండర్ నోవాక్ కూడా పాదతాడనమే బెస్ట్ అని నిర్ణయించుకున్నారు.

మీరు కాలితో హలో అంటే మేం మోచేతితో హలో అంటామంటూ చాలా మంది ముందుకు వచ్చారు. బల్గేరియన్ ఆర్ధిక వేత్త క్రిస్టలీనా జార్జీవా ఇటీవలే తన మోచేత్తో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ మోచేతిని తాకి హలో చెప్పారు. అమెరికాలో హిల్లరీ క్లింటన్ ఈ తరహా మోచేతిని తాకడాన్ని కరోనా హ్యాండ్ షేక్ గా అభివర్ణించారు. అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాళ్లు పిడికిళ్లు తాకించి, అరచేతులు తాకకుండా సెలబ్రేట్ చేస్తున్నారు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అయితే ఎవరినీ చేతితో తాకడం లేదు. తగినంత దూరంలో నిలుచుండే ఆమె అతిథులను పలకరిస్తున్నారు. ఇటీవల శ్రీలంక రాయబారి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఆమె దూరం నుంచే చేయి ఊపారు తప్ప దగ్గరకు రాలేదు.

ఇక ప్రపంచంలో మన నమస్తేకి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. భారతీయులు తమ రెండు చేతులు జోడించి చేసే నమస్కారం అన్నిటికన్నా సేఫ్ అని ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహు, బ్రిటిష్ యువరాజు చార్లెస్, జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రాస్నన్, ఆఖరికి మన ట్రంప్ బాబాయి కూడా నమస్తే అంటున్నారు. నమస్కారాలు చేస్తున్నారు. మన నమస్కారాన్ని థాయిలాండ్ లో వాయి అంటారు. ఇప్పుడు వాయి కూడా పాపులర్ అవుతోంది. మొత్తం మీద కరోనా మనం కరచాలనాలను మరిచిపోయేలా చేస్తోంది. మన నమస్తేని ముందుకు తెస్తోంది.

Next Story