ప్రజాదరణ పొందుతోన్న స్వదేశీ యాప్ లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2020 2:36 PM IST
ప్రజాదరణ పొందుతోన్న స్వదేశీ యాప్ లు

చైనా ఆటకట్టించేందుకు భారత్ లో ఆ దేశానికి సంబంధించిన 59 యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్, హలో, షేర్ ఇట్ వంటి యాప్ లు కూడా ఉన్నాయి. టిక్ టాక్, హలో యాప్ లకు బాగా అలవాటు పడిన నెటిజన్లు..ఇప్పుడు ఆ యాప్ రాకపోవడంతో స్వదేశీ యాప్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అచ్చు గుద్దినట్లు టిక్ టాక్ ఫీచర్స్ ను పోలిన చింగారి యాప్ ను గంటల వ్యవధిలో లక్షలాది మంది డౌన్ లోడ్లు చేసుకుంటున్నారు. టిక్ టాక్ కు పోటీగా రూపొందిన ఈ యాప్ నకు 10 రోజుల క్రితం 5 లక్షల డౌన్ లోడ్స్ ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య 25 లక్షలు దాటినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

షేర్ చాట్ విషయానికొస్తే చైనా యాప్ లు బ్యాన్ తర్వాత షేర్ చాట్ ను నెటిజన్లు బాగా వాడేస్తున్నారు. గడిచిన రెండ్రోజుల్లోనే 1.5 కోట్ల మంది షేర్ చాట్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. 12 భారతీయ భాషల్లో సేవలందిస్తోన్న రొపోసో కు కూడా వినియోగదారులు పెరుగుతున్నారు. ఇందులో ప్రస్తుతం 1.40 కోట్ల వీడియో క్రియేటర్లు ఉండగా నెలకు 8 కోట్ల వీడియోలు రూపొందుతున్నాయని పేర్కొంది ఈ సంస్థ.

వీటితో పాటు మహీంద్రా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న గోసోషియల్ అనే సోషల్ మీడియా సంస్థకు 20 శాతం వినియోగదారులు పెరిగారు. బాక్స్ ఎంగేజ్ డాట్ కామ్ అనే వీడియో షేరింగ్ వెబ్ సైట్ లాక్ డౌన్ లో ప్రారంభమైంది. చైనా యాప్ లపై నిషేధం ప్రకటించిన 24 గంటల్లోనే లక్ష మంది తమ వెబ్ సైట్ ను ఉపయోగించినట్లు తెలిపింది.

Next Story