సీఏఏ ఆందోళనకారులకు సుప్రీం చీవాట్లు

By అంజి  Published on  11 Feb 2020 2:42 AM GMT
సీఏఏ ఆందోళనకారులకు సుప్రీం చీవాట్లు

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న నిరసన పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. శిబిరంలో చలి తీవ్రతకు అనారోగ్యం పాలై ఓ శిశువు గత నెల 30న మృతిచెందడంతో ఆ విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. 4 నెలల పసికందుతో నిరసనల్లో పాల్గొనడమేంటని ప్రశ్నించింది. ఆ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంపై స్పందన దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Shaheen Bagh Protests..Supreme court

షాహీన్‌ బాగ్‌లో పసికందు హక్కులను రక్షించడంలో అతడి తల్లిదండ్రులు, నిరసన శిబిరం నిర్వాహకులు విఫలమయ్యారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి జాతీయ సాహస అవార్డు గ్రహీత జెన్‌ గుణ్‌రతన్‌ సదవర్తె లేఖ రాశారు. మైనర్లు నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని అందులో కోరారు. సీజేఐ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆ లేఖను పరిశీలించి.. శిశువు మృతి ఘటనను విచారణకు స్వీకరించాలని నిర్ణయించింది. కోర్టు నిర్ణయాన్ని కొందరు మహిళా న్యాయవాదులు వ్యతిరేకించారు.

Shaheen Bagh Protests..Supreme court

నిరసనల్లో పాల్గొన్న చిన్నారులను పాఠశాలల్లో జాతి వ్యతిరేకులుగా, పాకిస్థానీలుగా, ఉగ్రవాదులుగా పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయం నుంచి న్యాయవాదులు పక్కకు వెళ్తున్నారని మందలించింది. మరిన్ని సమస్యలను సృష్టించేందుకు వేదికగా ఈ అవకాశాన్ని వినియోగించు కోవద్దని హెచ్చరించింది. మరోవైపు- షాహీన్‌బాగ్‌లో ఆందోళనకారులు రోజుల తరబడి నిరసనతో రోడ్డును దిగ్బంధం చేయడంపై కూడా కోర్టు తీవ్ర అసంతృప్తి చేసింది. ఈ ఆందోళనవల్ల కాళిందీకుంజ్‌ నుంచి షాహీన్‌బాగ్‌ వైపు ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయిందని, అందుచేత ఆందోళనకారులు అక్కడనుంచి ఖాళీ చేసేట్లుగా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే నందకిషోర్‌ గార్గ్‌, మరికొందరు పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు నిరసన ప్రజాస్వామ్యంలో ఓ హక్కు, కానీ అదే సమయంలో పబ్లిక్‌ రోడ్లలో, పార్కుల్లో ఆందోళనలతో ప్రజలకు అసౌకర్యం కల్గించడాన్ని కూడా అంగీకరించమని స్పష్టం చేసింది. అయితే అక్కడ నుంచి నిరసనకారుల తొలగింపుపై తక్షణం ఆదేశాలివ్వడానికి నిరాకరించింది.

Next Story