నటి శ్రావణి ఆత్మహత్య కేసు : డీసీపీ వెల్లడించిన వివరాలివే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Sept 2020 5:24 PM ISTసీరియల్ నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో ముందు నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను కొద్దిసేపటి క్రితం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు.
ఈ కేసులో దేవరాజ్, సాయికృష్ణతో పాటు ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డినీ నిందితుడిగా చేర్చామన్నారు. అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారని.. ఇవాళ ఉదయం నుంచి అశోక్ రెడ్డి మొబైల్ పనిచేయట్లేదని పేర్కొన్నారు. ఈ ముగ్గురూ శ్రావణిని ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పారని.. ఆ తర్వాత ఆమెను పలు రకాలుగా వేధించారని తెలిపారు. ఈ బాధ భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
అయితే.. త్వరలోనే మరో నిందితుడు అశోక్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతామన్నారు. ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడానికి కుదరదని.. వారు ఆమె బాగుకోసమే కొంత ఒత్తిడి తెచ్చారని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు దేవరాజ్, సాయికృష్ణలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్‌గా తేలింది. ఇక అరెస్ట్ చేసిన దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు త్వరలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.
ఇక 2012లో హైదరాబాద్‌కు వచ్చిన శ్రావణి పలు సీరియళ్లలో ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. 2015లో సాయికృష్ణారెడ్డి, 2017లో నిర్మాత అశోక్‌రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. 2019లో దేవరాజుతో శ్రావణికి పరిచయం ఏర్పడింది. దేవరాజుకు శ్రావణి దగ్గరవుతుందని కుటుంబ సభ్యులకు సాయి చెప్పాడు. దేవరాజుతో శ్రావణి స్నేహంగా ఉండటం సాయికి నచ్చలేదు. దేవరాజుతో పరిచయం తర్వాత గొడవలు పెరిగాయి. దీంతో శ్రావణిని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు.