రెండోసారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్‌

By సుభాష్  Published on  16 Sept 2020 8:32 AM IST
రెండోసారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్‌

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కరోనా మొదలైనప్పటి నుంచి చాలా మంది లేనిపోని అపోహాలే ఎక్కువయ్యాయి. కరోనా రాకున్నా.. వస్తుందేమోననే అనుమానంతో వ్యాధి బారిన పడే వారు చాలా ఉన్నారు. అయితే ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్లీ వస్తుందేమోనని భయం చాలా మందిలో ఉంది. ఈ అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ క్లారిటీ ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ సోకడం చాలా అరుదని ఆయన స్పష్టం చేశారు. హాంకాంగ్‌లో రెండోసారి వస్తున్న కరోనా విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోలుకున్న వారికి తిరిగి వైరస్‌ సోకుతున్న వస్తున్నవార్తల నేపథ్‌యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చి దాని నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితి చాలా తక్కువ అని అన్నారు. ప్రజలకు కరోనాపై లేనిపోని అనుమానాలు ఎక్కువైపోతున్నాయని, ఇలాంటి ఆందోళనల వల్ల మనిషి మరింత కుంగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వేళ కరోనా వచ్చినా ధైర్యంగా ఉండాలని, ఏదో జరిగిపోతుందనే భయాందోళన వద్దని ఆయన సూచించారు. అవసరమైతే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని, ఎవరో చెప్పిన వాటిని నమ్మి ఆందోళన చెందవద్దని అన్నారు. ఇక రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ ఇంకా మూడో దశ పూర్తి కాలేదన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ వల్ల 76 మంది శరీరంలో యాంటీబాడీలు పెరిగినట్లు లాన్సెట్‌ జర్నల్‌ లో ప్రచురితమైందని చెప్పారు. కరోనా రికవరీ విషయంలో అన్ని దేశాలకంటే భారత్‌లో రికవరీ శాతం ఎక్కువగా ఉందని వెల్లడించారు.

కాగా, భారత్‌ లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 49,30,236కు చేరింది. వీరిలో ఇప్పటికే 38 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో 9 లక్షల 90వేల యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక దేశంలో మరణాల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 80,776కు చేరింది. అయితే మరణించిన వారిలో దాదాపు 70 శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారే ఉన్నారని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 78శాతానికి చేరడం కొంత ఉపశమనం కలిగించే విషయమనే చెప్పాలి. మరణాల రేటు 1.64 శాతం ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కోట్ల 83 లక్షలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇలా రోజురోజుకు మరణాలు, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

Next Story