తిరుపతి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా

By సుభాష్  Published on  8 Oct 2020 3:55 AM GMT
తిరుపతి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా

కరోనా వైరస్‌ విజృంభణ అంతా ఇంతా కాదు. సామాన్యుడి నుంచి ప్రముఖల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ తేలింది. అయితే గురువారం మరోసారి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకుని అనంతరం వైద్య సేవలు పొందనున్నారు. ఆగస్టులో ఎమ్మెల్యే భూమనకు కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పుడు రెండోసారి పాజిటివ్‌ తేలడంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, ఒక వ్యక్తికి ఒకసారి కరోనా సోకిన తర్వాత రెండో సారి సోకడం అనేది ఉండదని, అలాంటి కేసులు వచ్చే అవకాశాలు చాలా అరుదు అని ఇప్పటికే వైద్య నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. కానీ రెండో సారి కరోనా సోకిన కేసులు ఇతర దేశాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే నమోదయ్యాయి. కానీ రాష్ట్రంలో రెండోసారి కేసు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది.

కాగా, ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు బాగానే పెరిగిపోతున్నాయి. తెలంగాణతో పోల్చకుంటే ఏపీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపీలో కరోనా పరీక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపడుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. కరోనా పరీక్షలు పెంచడం వల్లే కేసులు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

కాగా, నిన్న ఏపీలో కొత్తగా 5120 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 34 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో 731532 చేరుకోగా, మరణాల సంఖ్య6086కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5వేల వరకు ఉంది.

Next Story
Share it