ఏపీలో నేటి నుంచే 'జ‌గ‌న‌న్న విద్యాకానుక'

By సుభాష్  Published on  8 Oct 2020 3:15 AM GMT
ఏపీలో నేటి నుంచే జ‌గ‌న‌న్న విద్యాకానుక

ఏపీ ప్ర‌భుత్వం గురువారం నుంచి జ‌గ‌న‌న్న విద్యాక‌నుక ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నుంది. కృష్ణాజిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. ముందుగా హైస్కూల్‌లో నాడు-నేడు ప‌నుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత కాసేపు విద్యార్థుల‌తో మాట్లాడ‌నున్నారు. అనంత‌రం విద్యార్థుల‌కు విద్యాకానుక కిట్ల‌ను అంద‌జేస్తారు.

ఈ కిట్లలో ఏముంటాయి..?

ఈ కిట్టులో స్కూల్ బాగ్‌, మూడు జ‌త‌ల యూనిఫామ్స్‌, ఒక జ‌త బూట్లు, రెండు జ‌త‌ల సాక్సులు, బెల్టు,పాఠ‌పుస్త‌కాలు, నోట్‌బుక్స్ ఉంటాయి. విద్యార్థుల యూనిఫామ్స్‌కు అయ్యే కుట్టుకూలి ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఖాతాలో జ‌మ చేయ‌నుంది.

కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్కూల్‌ కిట్లను అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్రంలో 42,34,322 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. సుమారు రూ.650 కోట్ల విలువైన ఈ కానుక కిట్లను విద్యార్థులకు అందజేస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు గణనీయంగా పెంచడంతో పాటు అభ్యాసన విషయంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పిల్లలను బడిలో చేర్పించే సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారికి అసగా ఉండేందుకు జగన్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Next Story
Share it