తెలంగాణలో కొత్తగా 1896 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 8 Oct 2020 3:28 AM GMT
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 50,367 కరోనా పరీక్షలు చేయగా, అందులో 1896 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,06,644 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1201కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 1,79,075 ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. ఇక హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 21,724 ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 33,96,739 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనాపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఒక రోజు కేసులు తగ్గితే.. మరుసటి రోజు పెరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ప్రతి రోజు 300లోపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కానీ ఇతర జిల్లా, మండలాలతో పాటు గ్రామాల్లో విస్తరించింది. అక్కడ పాజిటివ్ కేసులు బాగానే నమోదవుతున్నాయి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా కేసులు నమోదు కాకపోగా, ప్రస్తుతం పదుల సంఖ్యలో నమోదవుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగిన సూచనలు, సలహాలు అందజేస్తోంది.