వ్యవసాయ సీజన్ల పేర్లు మారాయ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు
వ్యవసాయానికి పెద్దపీట వేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతన్నలకు రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత కరెంట్, ప్రాజెక్ట్‌ల రూపకల్పనలో తన మార్కు చూపించిన కేసీఆర్.. మరోమారు ఈ నిర్ణయంతో తన రూటే సపరేటు నిరూపించుకున్నారు. వివరాళ్లోకెళితే.. ఖరీఫ్, రబీ పేర్లను తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటినుండో అలవాటైన పంట సీజన్లు వానాకాలం, యాసంగిగా మారుస్తూ కేసీఆర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆమోదించారు. ఇక నుండి రబీ, ఖరీఫ్ పేర్లు వాడకుండా.. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పోరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు పంట సీజన్ల పేర్ల మార్పును సూచిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదిలావుంటే.. మాములుగా ఖరీఫ్, రబీ పదాలు ఏ వ్యవసాయ సీజనో అన్న విషయమై చదువుకున్న వారితో పాటు సాధారణ జనం కూడా కాస్తా అయోమయానికి గురయ్యేవారు. దీంతో అందరికి అర్థమయ్యే రీతిలో వాటి పేర్లను వానాకాలం, యాసంగులుగా మార్చినట్టు తెలుస్తుంది. ఇకనుండి ఖరీఫ్, రబీ పదాలు వాడకుండా శాఖపరమైన ఉత్తర్వులు, పత్రాలలో వానాకాలం, యాసంగి పదాలనే వాడాల్సి ఉంటుంది.