ఆ కోతి ఆచూకీ చెబితే రూ.50వేల నజరానా..!
By సుభాష్ Published on 27 Sept 2020 12:08 PM ISTసాధారణంగా మనుషులెవరైనా తప్పిపోతే వారి ఆచూకీ తెలిపిన వారికి నజరానా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ కోతి ఆచూకీ చెప్పిన వారికి నజరానా ఇస్తామంటూ ప్రకటించడం గమనార్హం. ఆ కోతి ఆచూకీ చెప్పిన వారికి అక్షరాల రూ.50వేలు ప్రకటించింది ఓ సంస్థ. ఈ సంఘటన పంజాబ్‌లోని చండీగడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. చండీగఢ్‌కు చెందిన పచ్చబొట్టు ఆర్టిస్ట్ కమల్‌జీత్‌సింగ్, ఆయన మేనేజర్ దీపక్ వోహ్రా కోతిని పెంచుకున్నారు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం అటవీ జంతువులను అక్రమంగా పెంచుకోవడం చట్టరీత్యా నేరం.
దీంతో వారిద్దరినీ ఆగస్టు 19న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు ఒకరోజులోనే బెయిల్‌పై విడుదలయ్యారు. కోతిని పెంచుకున్న మాట నిజమేనని, అయితే అది చట్ట రీత్యా నేరమని తెలిసిన తర్వాత అడవిలో వదిలిపెట్టామని పోలీసుల విచారణలో వారు తెలిపారు. వారు చెప్పేది నమ్మకంగా లేదని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లవ్‌జీందర్ కౌర్ సరైన ఆధారాలతో నిరూపించాలని నిందితులకు సూచిస్తూ కేసును అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.
అయితే విచారణ సమయంలో నిందితులు చెప్పిన మాటల్లో స్పష్టత లేదని అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అబ్దుల్ ఖయ్యూం అభిప్రాయపడ్డారు. కోతిని అడవిలో విడిచిపెట్టినట్లుగా ఖచ్చితమైన ఆధారాలు సమర్పించలేదని తెలిపారు. కాగా, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన ఎన్జీవో సంస్థ కూడా తీవ్రంగా పరిగణించి కోతి ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నజరానా ప్రకటించింది. అలాగే కోతి ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంపై స్పందించిన కమల్‌జీత్ సింగ్, దీపక్ వోహ్రాలు స్పందించారు. ఈ వ్యవహారాన్ని మరింత పెద్దగా చేసేందుకు సదరు స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.