కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

By సుభాష్  Published on  27 Sep 2020 4:35 AM GMT
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, రిటైర్డ్‌ మేనేజర్‌ జశ్వంత్‌ సింగ్‌ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్‌ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత ముందుగా కరోనా పరీక్షలు చేయగా, నెగిటివ్‌ వచ్చింది. జశ్వంత్‌సింగ్‌ 1938 జనవరి 3న రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించారు. ఆయన సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి ఎన్నో సేవలు అందించారు. పదవీ విరమణ అనంతరం బీజేపీలో చేరి 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగారు. ఐదు సార్లు రాజ్యసభ, నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

అలాగే 1998-99 మధ్య జశ్వంత్‌ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ఆయా రంగాల్లో తనదైన ముద్రవేసుకున్నారు.

ఆయన మృతి పట్ల ప్రధాన నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. దేశ రాజకీయాలపై, సమాజానికి సంబంధించిన విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడు గుర్తించుకుంటానని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.



Next Story