అసలేంటీ ఈ స్పేడెక్స్‌.. ఇస్రోకు ఈ మిషన్‌ ఎందుకంత ప్రత్యేకం?

స్పేడెక్స్ అంటే.. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్ అని అర్థం. ఈ మిషన్‌ భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు ఎంతో ముఖ్యమైనది.

By అంజి  Published on  31 Dec 2024 11:27 AM IST
Spadex mission , ISRO, india

అసలేంటీ ఈ స్పేడెక్స్‌.. ఇస్రోకు ఈ మిషన్‌ ఎందుకంత ప్రత్యేకం?

స్పేడెక్స్ అంటే.. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్ అని అర్థం. ఈ మిషన్‌ భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు ఎంతో ముఖ్యమైనది. స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్, అన్‌డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ డెవలప్‌మెంట్‌, ప్రదర్శన స్పేడెక్స్ ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అంతరిక్షంలో రెండు స్పెస్‌షిప్‌లను ఒకదాని పక్కన మరొకటి చేర్చి అనుసంధానించడాన్నే స్పేస్‌ డాకింగ్‌ అంటారు. పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్‌ సహాయంతో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించారు.

సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి సరిగ్గా 10 గంటల15 సెకన్లకు పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఒక్కో దశను విజయవంతంగా ముగిస్తూ జంట శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ప్రయోగం విజయంతం అయినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో మిషన్‌లో తొలిభాగం విజయవంతమైందని చెప్పారు.

స్పేడెక్స్ మిషన్‌లో రెండు చిన్నసైజు స్పేస్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. వీటి బరువు 440 కిలోల వరకు ఉంటుంది. ఇవి భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఒకటి ఛేజర్ (SDX01) అనే శాటిలైట్(ఉపగ్రహం) కాగా, మరోటి టార్గెట్ (SDX02). విజయవంతంగా డాక్ చేయడం, డాక్ అయిన స్పేస్‌క్రాఫ్ట్‌ల మధ్య ఎనర్జీ ట్రాన్స్‌ఫర్, అన్‌డాక్ అయిన తర్వాత పేలోడ్‌లను ఆపరేట్ చేయడం ఈ మిషన్ లక్ష్యాలు. ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను మరో స్పేస్‌క్రాఫ్ట్‌తో కలపడాన్ని డాకింగ్‌ అని, కలిసి ఉన్న రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను వేరు చేయడాన్ని అన్‌డాకింగ్‌ అని అంటారు.

తక్కువ ఖర్చుతో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌, భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం, భారత ఆస్ట్రోనాట్‌లను చంద్రుడిపైకి పంపే ప్లాన్లకు.. ఈ మిషన్‌ ఎంతో ముఖ్యమైనది. 'స్పేస్ రోబోటిక్స్' వంటి భవిష్యత్ ప్రయోగాలకు కూడా ఈ మిషన్‌ ఎంతో అవసరమైనది. ఈ మిషన్ విజయవంతమైతే, ప్రపంచంలో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. అమెరికా, రష్యా, చైనా మాత్రమే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

Next Story