చంద్రయాన్ - 3 ప్రయోగానికి డేట్ ఫిక్స్
చంద్రయోన్ - ప్రయోగానికి డేట్ ఫిక్స్ అయ్యింది. జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.
By అంజి Published on 29 Jun 2023 5:02 AM GMTచంద్రయాన్ - 3 ప్రయోగానికి డేట్ ఫిక్స్
చంద్రయోన్ - ప్రయోగానికి డేట్ ఫిక్స్ అయ్యింది. జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగం ఉంటుందని తెలిపారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. లాంచ్ వెహికల్ మార్క్ -3 ద్వారా చంద్రయాన్ -3 ప్రయోగం చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ప్రయోగం చేపట్టనున్నారు. చంద్రయాన్ 3 పరీక్ష పూర్తయిందని, జూలై 12 నుంచి 19 మధ్య ప్రయోగానికి అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం వెల్లడించారు.
“ప్రస్తుతం చంద్రయాన్ 3 వ్యోమనౌక పూర్తిగా సమీకృతమైంది. మేము పరీక్షను పూర్తి చేసాము మరియు రాకెట్ కంపార్ట్‌మెంట్‌తో జతకట్టాము… ప్రస్తుతం, ప్రయోగానికి అవకాశం జూలై 12 నుంచి 19 మధ్య ఉంది. మేము సాధ్యమైనంత త్వరగా 12వ తేదీ, బహుశా 13వ తేదీ లేదా 14వ తేదీని తీసుకుంటాము. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మేము ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తాము”అని సోమనాథ్ చెప్పారు. ఇస్రో చీఫ్ ఆర్టెమిస్ అకార్డ్స్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న భారతీయ పరిశ్రమలకు యుఎస్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఇది ఒక అవకాశం అని అభిప్రాయపడ్డారు.
చంద్రయాన్ -2కు ఫాలో ఆన్ మిషన్‌గా చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవ్వడం, ఉపరితలంపై అటూఇటూ తిరగడం వంటివి ఈ ప్రయోగంలోని ప్రధాన లక్ష్యాలు. చంద్రయాన్-3లో స్పెక్ట్రో-పోలారిమెట్రి అనే పరికరాన్ని పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. భూమిపై పడే కాంతి ధ్రువణాన్ని చంద్రుడి కక్ష్యలో నుంచి కొలిచేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగంలో ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపైకి పంపించనున్నారు. రాకెట్‌లోని ప్రొపల్షన్ మాడ్యూల్.. ల్యాండర్, రోవర్లను చంద్రుడి కక్ష్యకు 100 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది.
ఆ తర్వాత రోవర్‌ను దించేందుకు ల్యాండర్ సహకరిస్తుంది. ల్యాండింగ్ తర్వాత చంద్రుడిపై తిరుగుతూ కీలక సమాచారన్ని రోవర్.. భూమికి చేరవేస్తుంది. ఇదిలా ఉంటే.. చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిన వ్యోమనౌక ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యోమనౌకలో చాలా మార్పులు చేశారు. సోలార్ ఎనర్జీని అధికంగా ఒడిసిపట్టేలా పెద్ద పెద్ద సోలార్ ప్యానెళ్లను అమర్చారు. జూన్ 12 నుంచి 19 మధ్య ప్రయోగం చేపట్టడం వల్ల తక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని ఇస్రో చైర్మన్ తెలిపారు.