దూసుకొస్తున్న గ్రహశకలం
This year's largest near-Earth asteroid to pass by on Sunday. ఈ ఏడాది భూమికి దగ్గరగా రానున్న ఓ భారీ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
By Medi Samrat Published on 17 March 2021 6:31 PM ISTఎన్నో గ్రహశకలాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా వీటిని ఆకాశంలో చూడొచ్చా అనే కుతూహలాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. ఈ ఏడాది భూమికి దగ్గరగా రానున్న ఓ భారీ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2001 ఎఫ్‌వో32 అనే ఈ భారీ గ్రహశకలం ఈ ఏడాది మార్చి 21న భూమికి దగ్గరగా 1.25 మిలియన్ మైళ్ల (2 మిలియన్ కిలోమీటర్లు) సమీపంలోకి చేరుకుంటుందని నాసా తెలిపింది.
ఈ అతిపెద్ద గ్రహశకలం వివరాలను కూడా తెలుసుకోవాలని నాసా భావిస్తోంది. 2001 ఎఫ్‌వో32గా పిలువబడే ఈ భారీ గ్రహశకలాన్ని 20 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వ్యాసం సుమారు 3,000 అడుగులు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం వల్ల ఇది భూమికి 1.25 మిలియన్ మైళ్ల కంటే దగ్గరగా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ దూరం భూమి నుంచి చంద్రుడికి మధ్య గల దూరానికి 5.25 రెట్లు అధికం అయినప్పటికీ దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటి వరకు భూమికి అతి సమీపంగా వచ్చిన గ్రహశకలాలన్నింటితో పోల్చితే ఈ 2001 ఎఫ్‌వో32 వేగం గంటకు 77,000 మైళ్లు అధికంగా ఉందని అంటున్నారు. భారీ గ్రహశకలం భూమికి సమీపంగా వస్తే వాటి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 21న 2001 ఎఫ్‌వో32 గ్రహశకలం భూమికి సమీపంగా వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలతో పోల్చితే దక్షిణార్థ గోళంలో ఉన్న వారికి ఇది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ గ్రహశకలం కారణంగా భూమికి ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తేల్చేశారు.