స్లీప్‌ మోడ్‌లోకి ప్రజ్ఞాన్‌.. మళ్లీ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాం: ఇస్రో

చంద్రుడి సౌత్‌ పోల్‌పై దిగిన విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుని రెస్ట్‌కు రెడీ అయ్యాయి.

By అంజి  Published on  3 Sep 2023 1:15 AM GMT
Pragyan rover, sleep, Moon, Isro, Vikram lander

స్లీప్‌ మోడ్‌లోకి ప్రజ్ఞాన్‌.. మళ్లీ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాం: ఇస్రో

ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ చంద్రుడి సౌత్‌ పోల్‌పై దిగిన విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుని రెస్ట్‌కు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా మొదట రోవర్‌ని స్లీప్‌ మోడ్‌లోకి పంపినట్టు శనివారం రాత్రి ఇస్రో ప్రకటన చేసింది. ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ.. ఒకటి, రెండ్రోజుల్లో విజ్ఞాన్‌, ప్రజ్ఞాన్‌లను స్లీప్‌ మోడ్‌లోకి పంపనున్నట్టు తెలిపారు. అయితే తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్రా అన్నది తెలియడానికి మరో రెండు వారాలు పడుతుంది. తన లక్ష్యాలను పూర్తి చేసుకున్న రోవర్‌ని ఇప్పుడు సేఫ్‌ ప్లేస్‌లో పార్క్‌ చేసి, స్లీప్‌ మోడ్‌లోకి పంపేశామని, మళ్లీ సూర్యోదయం అయ్యాక నిద్ర లేపడానికి ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది. అలాగే రోవర్‌లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS), లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) అనే రెండు పేలోడ్‌లు ఉన్నాయి. ల్యాండర్ ద్వారా భూమికి డేటాను ప్రసారం చేసే ఈ రెండు పేలోడ్‌లు ఆఫ్ చేయబడ్డాయి.

విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లకు సోలార్‌ శక్తే ఆధారం. సోలార్‌ ప్లేట్లు సూర్యకాంతిని రిసీవ్‌ చేసుకుని బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటాయి. ఇక చంద్రుడిపై ఒక పగలు భూమి మీద 14 రోజులకు సమానంగా పని చేసేలా వీటిని రూపొందించారు. ఆగస్టు 23న చంద్రుడి సౌత్‌ పోల్‌ ప్రాంతంలో విక్రమ్‌ దిగేటప్పటికి అక్కడ తెల్లవారింది. అనంతరం ఆ ల్యాండర్‌ నుండి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ కూడా తన బ్యాటరీలను రీఛార్జి చేసుకొని రీసెర్చ్‌ని ప్రారంభించింది. ఈ ల్యాండర్‌ దిగిన ‘శివ్‌శక్తి పాయింట్‌’ వద్ద ఇప్పుడు సాయంకాలం మొదలైంది. వెలుగులు తగ్గుతూ, క్రమంగా చీకట్లు ఆవరిస్తున్నాయి. 14 రోజుల రాత్రి సమయంలో అక్కడ ప్రతికూల పరిస్థితులను విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లు తట్టుకోలేవు. చంద్రుడిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఇంత అసాధారణ శీతల వాతావరణాన్ని ల్యాండర్‌, రోవర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తట్టుకోలేకపోవచ్చు. అందువల్ల విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లను స్లీప్‌ మోడ్‌లో ఉంచుతున్నారు. కాగా రోవర్‌ సోలార్ ప్యానెల్ సెప్టెంబర్ 22, 2023 న ఊహించిన తదుపరి సూర్యోదయం వద్ద సూర్య కాంతిని స్వీకరించడానికి సెట్‌ చేయబడిందని ఇస్రో తెలిపింది.

ప్రజ్ఞాన్ రోవర్‌కు "విజయవంతమైన మేల్కొలుపు" లేకపోతే అది భారతదేశ చంద్ర రాయబారిగా చంద్రునిపై శాశ్వతంగా ఉంటుంది. విలువైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించేందుకు ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ కలిసి పని చేస్తున్నాయి. ఏపీఎక్స్‌ఎస్‌, ఎల్‌ఐబీఎస్‌ పేలోడ్‌లు చంద్ర నేల, శిలల మూలక మరియు ఖనిజ కూర్పును విశ్లేషించడానికి రూపొందించబడ్డాయి. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపైకి వెళ్లింది. ఇది చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించింది. రోవర్ 100 మీటర్ల ప్రయాణం చంద్రుడి ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, సంచరించడంలో ఇస్రో యొక్క ఎండ్-టు-ఎండ్ సామర్థ్యానికి నిదర్శనం. చంద్రయాన్-3 ఆగస్టు 23, 2023న చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ మిషన్‌తో చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా భారత్‌ అవతరించింది.

Next Story