చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్
చంద్రయాన్-3 ద్వారా చందమామ గుట్టు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో మంగళవారం సంచలన ప్రకటన చేసింది.
By అంజి Published on 30 Aug 2023 6:30 AM ISTచంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్
చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని కొనసాగిస్తోంది. చందమామ గుట్టు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రోవర్‌కు ఉన్న ‘లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్ప్రెక్ట్రోస్కోప్’(ఎల్ఐబీఎస్) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొందని ఇస్రో తాజాగా వెల్లడించింది. దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్‌లను ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రకటించింది. హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషణ కొనసాగుతోందని తెలిపింది. ఇస్రో ప్రకటనతో టెక్నాలజీలో మనకంటే ఎంతో ముందున్న అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయి. మరోవైపు చంద్రుడిపై ఉష్ణోగ్రతల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ ఇప్పటికే భూమిపైకి పంపింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 40-50 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉండగా, ఉపరితలం నుంచి ఒక అడుగు లోతులో మైనస్ 10 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది.
పదార్థాల సమ్మేళనాన్ని తీవ్రమైన లేజర్ పల్సెస్‌కు ఎక్స్‌పోజ్ అయ్యేలా చేసి వాటిని విశ్లేషించే శాస్త్రీయ విధానాన్ని ఎల్ఐబీఎస్ అంటారు. ఈ సామర్థ్యం ఉన్న ఎల్ఐబీఎస్ పరికరం, ప్రజ్ఞాన్ రోవర్‌కు ఉంది. అధిక శక్తి గల లేజర్ పల్స్‌ను రాయి లేదా మట్టి వంటి పదార్థ ఉపరితలంపై కేంద్రీకరించినప్పుడు, ఆ లేజర్ పల్స్ తీవ్రమైన వేడితో స్థానికమైన ప్లాస్మాను ఏర్పరుస్తుంది. దాన్ని విశ్లేషించిన తర్వాత మూలకాలను గుర్తిస్తారు. ఈ విధానం ఆధారంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంలో సల్ఫర్, ఆక్సిజన్ సహా మరికొన్ని మూలకాలున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రాథమిక విశ్లేషణలలో అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం ఉన్నట్లు గుర్తించగా, మరింత సునిశిత విశ్లేషణలు మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ కూడా ఉన్నట్లు నిర్ధరించాయి.
ఇంతటి కీలకమైన అన్వేషణకు సాయపడిన ఎల్ఐబీఎస్ పరికరాన్ని బెంగళూరులోని ‘లేబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్’ తయారు చేసిందని ఇస్రో తెలిపింది. ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగగా, అనంతరం విక్రమ్ నుంచి వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై నడక ప్రారంభించింది. రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్‌లలో 10కి పైగా యాంటెన్నాలను అమర్చింది ఇస్రో. ప్రొపల్షన్ మాడ్యూల్, ఐడీఎస్‌ఎన్(ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్)తో కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్ ఐడీఎస్ఎన్‌తో, రోవర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో కూడా ఇది అనుసంధానమై ఉంది. రోవర్ కేవలం ల్యాండర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది.