సొర చేపలు.. 50 ఏళ్లలో ఎంత శాతం అంతరించాయంటే..!

Oceanic sharks and rays have declined by over 70 Percent. సొర చాపలు.. అదేనండీ షార్క్ చేపలు..! ఏదో సినిమాల ప్రభావం కారణంగా

By Medi Samrat  Published on  30 Jan 2021 11:03 AM GMT
సొర చేపలు.. 50 ఏళ్లలో ఎంత శాతం అంతరించాయంటే..!

సొర చాపలు.. అదేనండీ షార్క్ చేపలు..! ఏదో సినిమాల ప్రభావం కారణంగా వీటి గురించి తలుచుకుని ఎంతగానో భయపడుతూ ఉంటాం. అవి మనుషుల మీద దాడి చేస్తాయని.. మనుషులను నమిలి చంపేస్తాయని పెద్ద ఎత్తున చెప్పుకుంటారు. కానీ షార్క్ లు మనుషుల మీద దాడి చేయడం చాలా.. చాలా.. చాలా.. అరుదు. కానీ ఒక్క షార్క్ ఏదో పొరపాటున దాడి చేస్తే దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే షార్క్ లకు మనుషులు చేస్తున్న అన్యాయమే చాలా ఎక్కువ..! మనుషుల దెబ్బకు 1970 నుంచి 50 ఏళ్లలో 71 శాతం సొర చేపల సంఖ్య తగ్గిపోయింది. పాడు బుద్ధి కలిగిన మనిషి వేట కారణంగానే ఇలా షార్కులు అంతరించి పోతున్నాయి.

అమెరికాలోని స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కెనడాలోని సైమన్ ఫ్రేసర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సముద్రాల్లోని షార్కుల విషయమై అధ్యయనం నిర్వహించారు. 31 షార్క్ జాతుల్లో 24 జాతులు దాదాపు అంతరించి పోయే స్థితికి వచ్చేశాయని హెచ్చరిస్తున్నారు. వైట్ టిప్ షార్క్, సుత్తితల షార్క్, భారీ సుత్తి తల షార్క్ అనే మరో మూడు జాతులైతే దాదాపు అంతరించే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. 1950 నుంచి సముద్రాల్లో చేపల వేట బాగా పెరగడం.. అప్పటి నుంచి చేపల వేటకు వెళ్లే బోట్లు, మర పడవలు రెట్టింపవ్వడమే కాకుండా.. చేపల వేట కన్నా షార్క్ ల వేట ఎక్కువైపోయిందని తెలిపారు. షార్క్ లను అతిగా వేటాడం వల్ల సముద్రంలోని ప్రతి ఆహార వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.


ఉద్దేశపూర్వకంగానే సొర చేపలను వేటాడుతున్నా ట్యూనా, స్వార్డ్ ఫిష్ లను వేటాడేటప్పుడు సొరచేపలు వలల్లో పడుతున్నట్టు చేపల వేట కంపెనీలు కవర్ చేసుకుంటూ ఉన్నాయని పరిశోధకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర చేప జాతులు, జంతువులతో పోలిస్తే షార్క్ లు ప్రత్యుత్పత్తి దశకు చేరాలంటే చాలా ఏళ్లు పడుతుందని, వాటికి సంతానమూ చాలా తక్కువే ఉంటుందని అంటున్నారు. వేట పెరిగిపోవడం, వాటి సంతాన రేటు తగ్గడం వల్ల షార్క్ జాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో సింహాలు, పులుల్లాగానే సంద్రాల్లో షార్కులు కూడా అలాంటివేనని డ్యూక్ యూనివర్సిటీ పర్యావరణ వేత్త స్టువర్ట్ పిమ్ అన్నారు. వాటిని కాపాడుకుంటేనే జీవ వైవిధ్యం మెరుగ్గా ఉంటుందని, పర్యావరణ వ్యవస్థ సమతుల్యమవుతుందని చెప్పారు.


Next Story