మంగళయాన్ కథ ముగిసింది
Mangalyaan reaches end of life confirms Isro.అంగారక మిషన్ ‘మంగళయాన్’ ప్రస్థానం ముగిసిందని ఇస్రో ప్రకటించింది
By తోట వంశీ కుమార్ Published on 4 Oct 2022 3:30 PM GMTభారత మొట్టమొదటి అంగారక మిషన్ 'మంగళయాన్' ప్రస్థానం ముగిసిందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అంగారకుడిపైకి వెళ్లే వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయిలు పడిపోయాయని.. సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్టేనని ప్రకటించింది. గ్రహాల అన్వేషణ చరిత్రలో ఈ మిషన్ ఒక అద్భుతమైన సాంకేతిక, శాస్త్రీయ విజయం సాధించిందని ఇస్రో పేర్కొంది. మార్స్ ఆర్బిటర్‌కు గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ధృవీకరించింది.
భారతదేశ చారిత్రాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM) మంగళయాన్ ను 2013, నవంబర్ 5న ప్రయోగించగా.. సెప్టెంబర్ 24, 2014న మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల సేవలందించిన మంగళయాన్ లో బ్యాటరీ, ఇంధనం అయిపోయిందని ఇస్రో తెలిపింది. ఐదు సైంటిఫిక్ పేలోడ్‌లతో కూడిన మంగళయాన్ తన ఎనిమిదేళ్లలో ప్రస్తానంలో అంగరక ఉపరితలం, వాతావరణం-ఎక్సోస్పియర్‌పై గణనీయమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించేందుకు తోడ్పాటు అందించింది. మంగళయాన్ కక్ష్యను మెరుగుపరచడం ద్వారా దాని బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి ఇస్రో ప్రయత్నాలు చేసింది. కానీ అదేదీ వీలుపడలేదు.
మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) భారతదేశపు మొట్టమొదటి మార్స్ మిషన్. ఈ ప్రాజెక్ట్ కు 450 కోట్లను వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ నవంబర్ 5, 2013 ఉదయం 2:38 గంటలకు ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి) సి-25 ద్వారా ఈ మిషన్ ప్రయోగం విజయవంతంగా సాగింది. సెప్టెంబరు 24, 2014న అంగారకుడిపైకి చేరడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. సోవియట్ రష్యా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంగారక గ్రహ బాట పట్టిన ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరించింది. అంగారక గ్రహానికి పంపిన అత్యంత చౌకైన మిషన్ కూడా ఇదే.