పుష్పక్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో
అంతరిక్ష ప్రయాణాలు సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాడు అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది.
By అంజి Published on 22 March 2024 8:55 AM ISTపుష్పక్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో
అంతరిక్ష ప్రయాణాలు సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాడు అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. ఇస్రో శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని రక్షణశాఖకు చెందిన చల్లకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుండి 'పుష్పక్' అనే పునర్వినియోగ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇతర ఉన్నతాధికారులు ప్రయోగ వేదిక వద్ద పాల్గొన్నారు.
అత్యంత సంక్లిష్టమైన ‘రొబోటిక్ ల్యాండింగ్’ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగం చేపట్టారు. రన్‌వేపై ఖచ్చితత్వంతో స్వయంప్రతిపత్తితో పుష్పక్ దిగింది అని స్పేస్ ఆర్గనైజేషన్ తెలిపింది. “RLV - LEX 02 పరీక్ష; ఇస్రో మళ్లీ రాణించింది. "పుష్పక్ (RLV-TD) ప్రయోగం తర్వాత దాని ఖచ్చితమైన గమ్యస్థానానికి చేరుకుంది" అని ఇస్రో ట్వీట్ చేసింది.
RLV-LEX-02 Experiment:🇮🇳ISRO nails it again!🎯Pushpak (RLV-TD), the winged vehicle, landed autonomously with precision on the runway after being released from an off-nominal position.🚁@IAF_MCC pic.twitter.com/IHNoSOUdRx
— ISRO (@isro) March 22, 2024
ఈ సందర్భంగా ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, ‘భవిష్యత్ పునర్వినియోగ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వీ) ఇది. రాకెట్ భూమిపైకి సురక్షితంగా చేరాక.. అందులోని అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల్ని తిరిగి వాడతాం’ అని చెప్పారు. ఆర్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇస్రోకు ఇది మూడోది. తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ప్రవేశించడం ద్వారా అవసరమైన ఘనతను సాధించడమే పుష్పక్ వ్యోమనౌక ప్రయోగం లక్ష్యం. పూర్తిగా పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఇస్రో చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఇది ఒక భాగం.
"పుష్పక్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చినూక్ హెలికాప్టర్ ద్వారా పైకి లేపింది. ఆ తర్వాత 4.5 కి.మీ ఎత్తు నుండి విడుదల చేశారు. రన్‌వే నుండి 4 కి.మీ దూరంలో విడుదల చేసిన తరువాత, పుష్పక్ స్వయంప్రతిపత్తితో క్రాస్-రేంజ్ కరెక్షన్‌లతో పాటు రన్‌వే వద్దకు చేరుకుంది. అది ఖచ్చితంగా రన్‌వేపై దిగి వచ్చింది. దాని బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్‌లు, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్‌ను ఉపయోగించడం ఆపివేయబడింది” అని ఇస్రో తెలిపింది. ఈ వెహికల్‌కు దీనికి రామాయణంలో పేర్కొనబడిన పురాణ అంతరిక్ష నౌక పుష్పక విమానం పేరు పెట్టారు.